
చెన్నారావుపేట, సెప్టెంబర్ 8: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి సృజన్తేజ అన్నారు. బుధవారం ఆయన జోజిపేట, పాపయ్యపేట, బోజేర్వు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులు, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉన్న వారు పాఠశాలకు రానవసరం లేదని తెలిపారు. దగ్గరలోని పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు విధిగా మాస్కు ధరిస్తూ వంటశాల, పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం ఆయన పాపయ్యపేట హైస్కూల్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలో నూతన విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఆయన వెంట కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పాపమ్మ, ఉపాధ్యాయులు నాగరాజు, వేణుబాబు, మాధవి, విజయలక్ష్మి, రవీందర్రెడ్డి, వెంకటయ్య, కృష్ణమోహన్, కుమారస్వామి, సీఆర్పీ సంపత్ పాల్గొన్నారు.
హాజరు శాతాన్ని పెంచాలి
పర్వతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ సూచించారు. గోరుగుట్టతండా, జగ్గుతండా, సోమారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలని టీచర్లకు సూచించారు. ఉపాధ్యాయులు విధిగా రెండో డోసుల టీకా వేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్ఎంలు చంద్రశేఖర్, రవీందర్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.