సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారింది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ ఈఓ, ఐఓఎస్‌ల తీరు. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు 2 వేల నుంచి 20 వేల వరకు అందిస్తారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లకు సంబంధించిన నిధులు రూ.5 కోట్లు అందినట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు.
కానీ క్షేత్రస్థాయిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, బండ్లగూడ, షేక్‌పేట తదితర జోన్ల పరిధిలోని 30 స్కూళ్లకు ఇప్పటికీ డబ్బులు రాలేదని పాఠశాలల హెచ్ఎంలు చెబుతున్నారు. మరి విద్యాశాఖ విడుదల చేసిన కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలోనూ కొందరు డిప్యూటీ ఈఓ, ఐఓఎస్‌లు చేతి వాటం చూపారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే నిధుల లేమితో కొన్ని స్కూళ్లు విద్యార్థులనే స్వీపర్లుగా ఉపయోగిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్వీపర్ల నియామకానికి, ఇతరాత్ర మెయింటెనెన్స్ కోసం చాలీ చాలని నిధులు కేటాయిస్తే అవి కూడా పూర్తిస్థాయిలో అన్నీ పాఠశాలలకు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో విద్యాశాఖ లెక్కల ప్రకారం 672 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ తదితర మెయింటనెన్స్ కింద జిల్లా విద్యాశాఖ నిధులు కేటాయిస్తున్నది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా 7 స్లాబులుగా నిర్ణయించి నెలకు డబ్బులు కేటాయిస్తారు. 30 మంది విద్యార్థులోపు ఉంటే నెలకు రూ.3వేలు, 750 మందికి మించి ఉంటే రూ.20వేలు కేటాయించారు.
కానీ ఈ నిధులు నగరంలోని చాలా స్కూళ్లకు అందలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో డిప్యూటీఈఓ, ఐఓఎస్‌లు నిధులు కేటాయించినట్టు చూపించి డబ్బులు పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. మరోవైపు నెల రోజులు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న స్వీపర్లకు నెలనెల జీతం రావడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి జీతం చెల్లిస్తున్నారు. అది కూడా వెయ్యి రూపాయలు మించడం లేదని స్వీపర్లు వాపోతుండటం గమనార్హం.
అయితే ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అంతర్గతంగా విచారణ జరిపిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇటీవల 12 మంది డిప్యూటీ ఈఓ, 24 మంది డిప్యూటీ ఐఓఎస్‌లు, మరికొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కలెక్టర్ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తప్పు చేశారనే ఆరోపణలు వస్తే వారిని ప్రాధాన్యత లేని విభాగాల్లో కొనసాగించాల్సి ఉన్నా.. అంతకు మించి ప్రాధాన్యత ఉన్న జోన్లకు బదిలీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.