మణికొండ, ఫిబ్రవరి 19: బాలికకు మాయమాటలు చెప్పారు.. షాపింగ్‌కు తీసుకెళ్లారు.. బిర్యానీలో ఏదో మత్తు పదార్థం కలిపారు.. బాధితురాలు మత్తులోకి జారుకున్నాక.. సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో తన అమ్మమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుతున్న 16 ఏండ్ల బాలిక ఈనెల 16న ఉదయం పాఠశాలకు వెళ్తున్నానంటూ చెప్పి.. ఇంట్లో నుంచి బయటకువెళ్లి, తిరిగి రాలేదు.
ఆందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పరిచయమున్న వ్యక్తులతోనే బాలిక వెళ్లినట్టు తేలడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్ డేటా, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆరా తీయగా, ఫిబ్రవరి 7న సదరు బాలిక చార్మినార్ ప్రాంతంలో తలాబ్ కట్టా ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలుడితో కలిసి షాపింగ్ చేసినట్లు తేలింది.
ప్రతిరోజూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుతూ ఈనెల 16న పాతబస్తీలోని మదీనా వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈనెల 16న స్కూల్‌కు వెళ్తున్నానంటూ చెప్పి..ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు మదీనా ప్రాంతానికి వెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ షాపింగ్ చేసిన తర్వాత బాలుడు తన స్నేహితులైన ఇమ్రాన్, మరో బాలుడు, బాలిక కలిసి ఓ హోటల్లో బిర్యానీ తిన్నారు. అయితే బిర్యానీలో గంజాయి తరహా మత్తు పదార్థం కల్పడంతో బాలిక క్రమ క్రమంగా మత్తులోకి జారుకున్నట్లు తెలిసింది.
హోటల్ దగ్గర నుంచి బాలికను ఆ ముగ్గురు దుండగులు ఆటోలో చెంగిచర్ల ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక పూర్తిగా మత్తులోకి జారుకోవడంతో ఇద్దరు బాలురతో పాటు ఇమ్రాన్ అనే వ్యక్తి ఒకరి తరువాత మరొకరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు, ఆమెను తీసుకెళ్లిన నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాధితురాలు చెంగిచెర్ల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఈనెల 18న ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని గుర్తించి, చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడైన ఇమ్రాన్‌తో పాటు బాలుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో బాలుడి కోసం పోలీసులు
గాలిస్తున్నారు.
బాలికపై లైంగికదాడికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ఇమ్రాన్, అతడితో పాటు మరో ఇద్దరు మైనర్లపై నార్సింగి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇమ్రాన్ గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేల్చారు. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో అనుమానితుడిగా షీట్ ఉన్నట్లు గుర్తించారు.
బాధితురాలికి దుండగులు అసలు మత్తు పదార్థాలు ఇచ్చారా లేదా అనేది వైద్య పరీక్షల్లో తెలియాల్సి ఉంది. ఒక వేళ మత్తు పదార్థం ఇస్తే అది గంజాయా లేక మద్యమా ఏరకమైన డ్రగ్ అనేది కూడా వైద్య పరీక్షల్లో తెలియాల్సి ఉంది. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటాం.
– ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి
మేడిపల్లి, ఫిబ్రవరి 19: ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీకి చెందిన మహిళపై ఇంటి పక్కన నివాసముంటున్న యాడవల్లి రంజిత్‌రెడ్డి ఈనెల 17న లైంగిక దాడికి యత్నించాడు. అదే సమయంలో ఆమె భర్త ఇంటికి రావడంతో గమనించిన రంజిత్‌రెడ్డి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.