న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడం పట్ల దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం రాష్ర్టాలను తీవ్రంగా విమర్శించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం మోపే బాధ్యతారాహిత్యమైన ఉచితాలను ప్రకటిస్తుండటంపై రాష్ర్టాలను సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా ఇంత ఆకస్మికంగా ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎందుకు ప్రకటించారని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీని కారణంగా విద్యుత్ సరఫరా సంస్థలు (డిస్కమ్‌లు) సుంకాలు, బడ్జెట్ లెక్కలు సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాయని పేర్కొంది. విద్యుత్ సవరణ చట్టాలు, 2024లోని నిబంధన 23ను సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడి ధర్మాసనం విచారించింది.
ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ లోటుతో ఉన్న విషయాన్ని తాము గుర్తించామని, ఎలాంటి ముందస్తు ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ర్టాలు ఈ సబ్సిడీ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. అదుపు లేకుండా ఇచ్చే ఉచితాలు దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీస్తాయని హెచ్చరించింది.
ఎన్నికలకు ముందు పలు రాష్ర్టాలు ఆకస్మికంగా పలు సంక్షేమ పథకాలను ప్రకటించడం చూశామన్నారు. ఒకవేళ ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలను ప్రకటిస్తే, వారు ఇక పనిచేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఒక వేళ ప్రభుత్వం ఉచిత నగదుతో పాటు, ఉచిత విద్యుత్, ఇతర సౌకర్యాలు కలిస్తే చివరిగా ఆ భారం మోయాల్సింది ఎవరు?’ అని ప్రశ్నిస్తూ.. అంతిమంగా ఆ ఉచితాల భారమంతా పన్ను చెల్లింపుదారుల తలపై పడుతుందని పేర్కొంది.
ఉచితాలపై సీజేఐ మాట్లాడుతూ ‘ఎన్నికల ముందే ఈ ఉచితాలు ఎందుకు ప్రకటిస్తున్నారు. అన్ని పార్టీలు, సామాజికవేత్తలు, మేధావులు దీనిపై పునరాలోచించాలి. ఈ విధానం ఇంకా ఎంతకాలం కొనసాగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతున్నాయి. అయినా అవి ఉచితాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మీరు ఏడాది 25 శాతం ఆదాయాన్ని పొందుతూ ఉంటే దానిని రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు ఖర్చు చేయరు?’ అని ప్రశ్నించారు.