CCI : ఆదిలాబాద్లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఫలించనుంది. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) నేతృత్వంలోని బృందం బుధవారం కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి గౌడ(Kumaraswamy Gouda)తో జరిపిన చర్చలు సఫలమవ్వడమే అందుకు కారణం. ఈ సందర్భంగా అధునాతన సాంకేతికతతో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దాంతో, మూతపడిన సీసీఐ మళ్లీ వందలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి పూల బొకే అందించారు. అనంతరం ఆదిలాబాద్ CCI పరిశ్రమ పునఃప్రారంభంపై విస్తృతంగా చర్చించారు.

జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే CCI పరిశ్రమను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని మంత్రిని కేటీఆర్ కోరారు. చర్చల అనంతరం మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తే ఆదిలాబాద్ CCI ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమను శాశ్వతంగా మూతపడనివ్వబోమని కుమారస్వామి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వెసులుబాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే CCI పునరుద్ధరణ సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు.
కుమారస్వామి నుంచి సానుకూల స్పందన రావడంతో సీసీఐ సాధన సమితి తమ పోరాటం ఫలిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలకు తావులేకుండా CCI పునఃప్రారంభానికి సంయుక్తంగా ముందడుగు వేయాలని సాధన సమితి నాయకులు కోరారు.
అయితే CCI విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో-కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కో-కన్వీనర్లు అంచెట్టి అరవింద్, అరుణ్ కుమార్, వెంకట నారాయణ, జగన్ సింగ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, బొల్లు ఈశ్వర్ దాస్, సంగెం బొర్రన్న, ఉజిగిరి విట్టల్, కారింగుల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.