
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : సులభంగా డబ్బులు సంపాదించాలని ఆటో, ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని షాపూర్‌నగర్‌కు చెందిన పిన్నపురెడ్డి యోగేందర్ప్రసాద్రెడ్డి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండలో ఉంటున్నాడు. కూలి పనులు చేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదనకు ఆటోలు, బైక్‌లను దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడు. పార్కింగ్ చేసి ఉన్న ఆటోలు, మోటర్ సైకిళ్లను ఎంచుకున్నాడు.
నెల రోజుల నుంచి హైదరాబాద్, హనుమకొండ, నర్సంపేట ఏరియాల్లో ఆటోలు, బైక్‌లు దొంగిలించి తన ఇంటి వద్ద దాచి ఉంచాడు. ఈనెల 7న గతంలో దొంగిలించిన ఒక ఆటోలో హనుమకొండకు వస్తుండగా ఎస్సై సీహెచ్ రఘుపతి ములుగురోడ్ క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండడాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. విచారించగా 4 ఆటోలు(2 హనుమకొండ, బాలనగర్, నాచారం, 2 బైకులు(గీసుకొండ, నర్సంపేటలో) చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆటోలు, బైక్‌లను స్వాధీనం చేసుకుని యోగేందర్ప్రసాద్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సై సీహెచ్ రఘుపతి, కానిస్టేబుళ్లు బావ్‌సింగ్, నగేశ్, ఎండీ గౌస్‌పాషా, ఎండీ యూసుఫ్, వీరేందర్, వినోద్, రవి, టెక్నికల్ టీం కానిస్టేబుళ్లు శ్రీకాంత్, భాస్కర్‌ను వారు అభినందించారు.