
వరంగల్, సెప్టెంబర్ 4 : విద్యాసంస్థలు ప్రారంభం కావడంలో యాజమాన్యాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టాయి. దీంతో ఇప్పటి వరకు టీకాలు వేసుకోని విద్యార్థుల కోసం కాలేజీల్లోనే టీకా సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కళాశాలలో ప్రత్యేక టీకా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యాశాఖ అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు. వంద శాతం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారు.
విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్..
విద్యాసంస్థలు ప్రారంభమై విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాల జాబితాను డీఎంహెచ్‌వోకు అం దజేశారు. మొత్తం 59 డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 37 డిగ్రీ కళాశాలలు ఉండ గా, అందులో 7 ప్రభుత్వ, 30 ప్రైవేట్‌కు చెందినవి. 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 2 ప్రభుత్వ కళాశాలలు కాగా, 8 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. 12 పీజీ కళాశాలలు ఉండగా, ఒకటి ప్రభుత్వ కళాశాల కాగా, 11 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లోని టీకాలు వేయించుకోని విద్యార్థుల జాబితా సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. సుమారు 10 వేల మం ది విద్యార్థులు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల సిబ్బందికి వంద శాతం టీకాలు..
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు అటెండర్లు, స్వీపర్లు, మధ్యాహ్న భోజనం వండే వారికి టీకాలు వేశారు.
వారం రోజుల్లో ప్రత్యేక క్యాంపులు
-డాక్టర్ లలితాదేవి, డీఎంహెచ్‌వో, హనుమకొండ జిల్లా
ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ టీకాలు వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి విద్యార్థికి టీకా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వారం రోజుల్లో కాలేజీల్లోనూ టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే కళాశాలల వివరాలు విద్యాశాఖ నుంచి అందాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థికీ వ్యాక్సిన్ వేస్తాం.