వరంగల్ చౌరస్తా, మే 8 : వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రాంతీయ నేత్ర వైద్యశాల, జిల్లాలోని ఇతర ప్రభుత్వ దవాఖానల వైద్యాధికారులు, ఆర్ఎంవోలు, విభాగాధిపతులతో సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, వాటిని మెరుగు పర్చుకోడానికి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి వివరాలు, ప్రణాళికలతో సమావేశానికి హాజరు కావాలని వైద్యాధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. అత్యవసర వైద్యసేవల కోసం రోగులను హైదరాబాద్ తరలించడం పూర్తిగా తగ్గించేలా జిల్లాలోని హాస్పిటళ్లను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో ఎంజీఎం దవాఖానను సందర్శించిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పినట్లుగానే సోమ, మంగళవారాల్లో జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించి వైద్య రంగాన్ని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకోనున్నారు.