బచ్చన్నపేట, సెప్టెంబర్ 18 : మండల కేంద్రంలో పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న దుర్గమ్మ ఆలయాని (Durgamma Temple)కి సంబందించిన భూమిని ఆక్రమించాలని చూస్తే ఊరుకోమని గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఇదే విషయమైన మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు గురువారం తహసీల్దార్ రామానుజాచారీని కలిశారు. దుర్గమ్మ ఆలయం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఉందని, గతంలో కొందరు ఆ భూమిని ఆక్రమించాలని చూస్తే అన్ని పార్టీలు, పాత్రికేయుల ఆధ్వర్యంలో పోరాటం చేశామని వారు ఎమ్మార్వోకు వెల్లడించారు. అయితే.. కొందరు ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వారు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమన్నా తప్పు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు హెచ్చరించారు.
ఈ విషయమై తహసీల్దార్ రామానుజాచారీని వివరణ కోరగా.. గ్రామానికి చెందిన ముస్లీంలు తమకు ఆలయ భూమిలో ఎకరం వస్తుందని ధరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. అయితే.. గ్రామ ప్రజలు మాత్రం ఆ మూడెకరాల భూమి దుర్గమ్మ ఆలయానికే చెందుతుందని అంటున్నారని, దాంతో రెండు వర్గాలతో మాట్లాడి వివరాలను సేకరించామని ఎమ్మార్వో వెల్లడించారు. అందుకే.. గ్రామంలోని అన్ని పార్టీల నేతలను గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా పిలిపించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. తహసీల్దార్‌ను కలిసినవాళ్లలో ఆరలు వంశీకృష్ణ, మునావర్, సిబ్బంది యాకన్న, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పార్టీల నేతలు నల్లగోని బాలకిషనౌడ్, ఆల్వాల ఎల్లయ్య, వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకట్ రెడ్డి, దొంతుల చంద్రమౌళి తదితరులు ఉన్నారు.