లింగాల ఘణపురం : లింగాల ఘణపురం మండలంలోని వడిచెర్ల మహిళా పొదుపు సంఘాల్లో (Vadicherla savings societies) వీఎవోలు సభ్యులకు తెలపకుండా రూ.37 లక్షలు కాజేశారని(VAOs misused funds) అధికారులు తెలిపారు. వడిచెర్లలో ఐకెపి అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించి వివరాలను మహిళా సంఘాలకు, గ్రామస్తులకు వివరించారు. ఆ గ్రామంలో మదర్ తెరిసా, అంకిత గ్రామైక్య సంఘాల పరిధిలో 59 పొదుపు సంఘాలు ఉన్నాయన్నారు. మదర్ తెరిసా గ్రూపు వివోఏ గ్రూపు నజమ రూ.24 లక్ష వాడుకోగా.. అంకిత గ్రూపు వివోఏ ప్రభాకర్రూ.12 లక్షలకు పైగా వాడుకున్నట్లు తేలిందన్నారు.
గ్రామంలో గత నెల రోజుల నుంచి ఆడిట్ చేసి లెక్కలను తేల్చామన్నారు. సోమవారం నజమా నుంచి ఆరు లక్షలు, ప్రభాకర్ నుంచి 5 లక్షలకు పైగా వసూలు చేసి సంఘాల్లో జమ చేశామని వివరాలను వెల్లడించారు. మిగిలిన 26 లక్షలని ఈనెల 20 లోపు చెల్లించాలని ఆదేశించామన్నారు. డబ్బులు పూర్తిగా వసూలు చేశాక జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని గ్రామసభలో ఐకెపి అధికారులు తెలిపారు. గ్రామ సభలో డిపిఎంలు వరలక్ష్మి, వినీతా రెడ్డి, ఏపీఎం శంకరయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, ఆడిటర్లు రాధిక, శ్వేత, 59 పొదుపు సంఘాల బాధ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.