కేంద్రంపై టీఆర్ఎస్ మరోసారి పోరుబాట
ఈ నెల 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీజేపీ ప్రభుత్వం మొత్తం వడ్లు కొనాలని డిమాండ్
రాష్ట్ర సర్కారు చర్యలతో పెరిగిన పంట
తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతను ఆగం చేస్తున్నది. రైతు వ్యతిరేక విధానాలను అమలుచేస్తూ వడ్ల కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతులపై కక్షగట్టింది. ప్రస్తుతం యాసంగి వడ్లు చేతికందనున్న నేపథ్యంలో మొత్తం వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో వరి రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. ఈమేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వగా, మోదీ సర్కారు తీరును ఎండగట్టేలా నిరసనలు తెలిపేందుకు ఉమ్మడి వరంగల్‌లోని గులాబీ దళం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించి ప్రతి రైతును ఈ ఆందోళనల్లో భాగస్వామిని చేసే పనుల్లో నిమగ్నమైంది.
అందరికీ అన్నం పెడుతున్న వరి రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆగం చేస్తున్నది. రైతు వ్యతిరేక చట్టాలకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం వరి పంట సాగు చేయకుండా పలు విధానాలను అమలు చేస్తున్నది. తెలంగాణలోని అత్యధిక మంది రైతులకు ఇబ్బంది కలిగించే బీజేపీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ మరోసారి ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. తెలంగాణలోని వరి రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. యాసంగి సీజన్లో సాగు చేసిన వరి పంట కోతలకు వస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఈ నెల 24, 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సాగుచేసిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండుతో చేపట్టనున్న ఈ ఉద్యమం.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం తరహాలో కొనసాగించాలని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రెండు రోజులపాటు జరిగే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆరు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించి ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఎక్కువ మంది రైతులను భాగస్వాములను చేసేలా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రతి రైతును జాగృతం చేసి ఉద్యమంలో భాగస్వాములను చేసేలా సన్నాహక కార్యక్రమాలను చేపట్టారు.
కేంద్రం మోసం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలతో వ్యవసాయరంగం పురోగతి సాధించింది. ప్రతి ఎకరాకు సాగునీరు, రైతుబంధుతో పెట్టుబడి, సాగుకు నిరంతరం ఉచిత కరెంటు వంటి పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఊరిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా మారింది. రికార్డు స్థాయిలో వడ్లు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. పంజాబ్ రాష్ట్రంలో పండిన మొత్తం వడ్లను కొనుగోలు చేసి, తెలంగాణలోని రైతులకు ఇబ్బందులు పెడుతున్నది. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే వరి పంట కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. రెండేండ్లుగా ఈ ఆంక్షలను ఇంకా పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తుండడంతో రాష్ట్రంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడంలో గందరగోళ పరిస్థితులు ఉంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ పక్రియ నుంచి వైదొలుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో మన రాష్ట్రంలో పండిన మొత్తం పంటను కొనే పరిస్థితి లేకుండాపోతున్నది. నీటివసతి పెరగడం, కొన్ని ప్రాంతాల్లో వరి తప్ప మిగిలిన పంటలు వేసే పరిస్థితి లేకపోవడంతో యాసంగిలోనూ ఈ పంటను సాగుచేశారు. తప్పనిసరి పరిస్థితులలో వరి సాగు చేసిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పంటలను కొనుగోలు చేయించేలా కార్యాచరణ మొదలుపెట్టారు. వరి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పేలా టీఆర్ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది.