జనగామ : పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో రూ. 20 వేలు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు.
ఇందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) పగిడే శివాజీని సంప్రదించాడు. రూ. 20 వేలు ఇస్తే బిల్లులు ఇస్తానని మొండికేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకోగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు తనిఖీ చేసి రెడ్ హ్యండెడ్ (Redhanded) గా పట్టుకున్నారు.
లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టు (ACB Court) లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.