దళిత సాధికారతకు సర్కారు కృషి
ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రత్యేక చర్యలు
ప్రతి పేద కుటుంబానికి రూ.10లక్షల చొప్పున సాయం
స్వయం ఉపాధిలో రాణించేలా చేయూత
ఉమ్మడి జిల్లాలో మొదటి దశ 1200 కుటుంబాలకు లబ్ధి
పథకం అమలుకు అధికారుల కసరత్తు
వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితులకు స్వయం ఉపాధి అవకాశాలు చూపి ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగేలా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ స్కీం (సాధికారత పథకం)ను ప్రకటించా రు. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూర్చనున్నారు. అర్హులైన దళిత కు టుంబానికి రూ.10లక్షల చొప్పున వారి బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నారు. ఈమేరకు ఉమ్మ డి జిల్లాలో 1200 కుటుంబాలకు లబ్ధి కలుగనుం ది. ఇల్లందు, భద్రాచలం, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోకవర్గాల్లోని దళిత కుటుంబాలు మరికొన్ని ఈ జాబితాలో ఉండనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలు కోసం తొలిదశలో రూ.1200 కోట్లు కేటాయించారు. దళితుల జనాభాతో పాటు, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకాల మాదిరిగానే పారద్శకంగా అర్హులైన కుటుంబాలకు ఈ పథకంతో నేరుగా లబ్ధి కలిగే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిధులతో వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి రంగంలో రాణించేందుకు కావాల్సిన శిక్షణను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దళితుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వీరి సాధికారత కోసం వచ్చే మూడు నాలుగేళ్లలో రూ.30వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల వరకు ఖర్చు చేయనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సాధికారత వైపు..
ఉమ్మడి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 6,80,970 మంది దళితులున్నారు. ఈ పదేండ్లలో మరికొన్ని లక్షల జనాభా పెరిగినట్లు అంచనాలున్నాయి. జనాభా ప్రాతిపదికనే రాజకీయంగా ఈ వర్గాలకు జిల్లాలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. వరంగల్ లోక్‌సభతోపాటు వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ వర్గానికి రిజర్వు అయ్యాయి. జనాభా పరంగా వచ్చిన రాజకీయ అవకాశాలకు తోడుగా దళితులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేలా సీఎం కేసీఆర్ పలు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ పథకంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలో 600 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 133 మందికి, ములుగు జిల్లాలో 71 మందికి భూమిని పంచారు. ప్రభుత్వ భూముల లభ్యత లేకపోవడం, బహిరంగ మార్కెట్లో భూముల విలువలు భారీగా పెరగడంతో ఈ పథకం అమలు కొంచెం నెమ్మదించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళితుల సాధికారత కోసం అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. తెలంగాణలో భారీగా గురుకులాలను ప్రారంభించి ప్రతి దళిత బాలుడికి మెరుగైన విద్య అందేలా చర్యలు చేపట్టారు. ఆసక్తి కలిగిన ప్రతిభావంతులకు విదేశాల్లోనూ చదువుకునేలా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నారు. చదువు, ఉపాధి అవకాశాలతోపాటు ఇప్పుడు పేద దళిత కుటుంబాల సాధికారత లక్ష్యంగా సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.