జనగామ రూరల్, మార్చి 14: జనగామ (Jangaon) జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయస్సు సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నపిల్లలు బాటిళ్లలో రంగులు కలిపి ఒకరికొకరు చల్లుకున్నారు. మరి కొందరు సహజ సిద్ధమైన ప్రకృతి రంగు అయినా గోగు పూలతో తయారు చేసిన రంగులను చల్లుకున్నారు. పలు గ్రామాల్లో కొందరు యువకులు కోడిగుడ్లు, టమాటాలు కొట్టుకొని హోలీ వేడుకలు జరుపుకున్నారు.
గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరుపుకొని సంతోషం వ్యక్తం చేశారు. యువకులు డప్పు చప్పుళ్లతో వీధుల్లో తిరుగుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. చిన్నపిల్లలు సైతం రంగులను పూసుకుని తమ సంతోషాన్ని, ఆనందాన్ని పొందారు. మండలంలో ఈ హోలీ వేడుకలు కుల మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపి ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.