జనగామ రూరల్ : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. వేతనాలు చెల్లింపునకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా సీఎం రేవంత్ చొరవ తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. శుక్రవారం జనగామ ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ సిబ్బంది నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్న పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కానీ ప్రభుత్వం జనవరి 1 నుండి కార్మికుల వేతనాలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం కార్మికుల వేతనాలు చెల్లించ లేదన్నారు. రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో కార్మికుల నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే విధంగా ముఖ్యమంత్రి దృష్టి సారించాలని అన్నారు.