బచ్చన్నపేట. మార్చి 9 : బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో యాసంగి పంటకు నీరు అందక వరి పంటలు ఎండిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆందోళన పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలకు వెంటనే సాగునీరు అందించాలని స్థానిక చౌరస్తాలో వివిధ గ్రామాల రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాల నుంచి బచ్చన్నపేట మండలం గోదావరి జలాలతో సస్యశ్యామలమైందన్నారు. గత సంవత్సరాల మాదిరిగానే బచ్చన్నపేట మండలానికి గోదావరి నీళ్లు వస్తాయని ఉద్దేశంతో ప్రతి రైతు తన పొలంలో వరి పంట వేశారన్నారు.
పంట పొట్ట దశకు రాగానే భూగర్భ జలాలు అడుగున పడడంతో పంట పొలాలకు నీరు సరిపోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గోదావరి జలాల కోసం రైతన్నలు ఎదురు చూడగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు, మాపు వస్తాయని మోసపు మాటలు చెప్పడంతో వారిని నమ్మి రైతన్నలు అధిక పెట్టుబడిపెట్టి పంటలు వేశారన్నారు. ఇప్పటికైనా సాగునీటి సౌకర్యం కల్పించి అలాగే ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నాయకులు పందిపిల్లి సిద్ధిరామిరెడ్డి, గంగం సతీష్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ పులిగిల పూర్ణచందర్, సిద్దిరాంరెడ్డి, నరెడ్ల బాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మొహమ్మద్ షబ్బీర్ అహ్మద్, కవ్వం కర్ణకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు పడిగల మున్నా, దస్తగిరి, అజీమ్, కొండి వెంకట్ రెడ్డి, మూసిని రాజు, మధు, దుర్గ ప్రసాద్ రెడ్డి, చెట్టే రాములు, జూకంటి కిష్టయ్య, నరసి రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, శిద్దారెడ్డి, కైసర్, నీల మురళీ, వినయ్ పాల్గొన్నారు