జనగామ రూరల్ : రైతుల పంట పొలాలు ఎండిపోకుండా గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం జనగామ- హుస్నాబాద్ రహదారి వడ్లకొండ క్రాస్ రోడ్ వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై టైర్లు కాల్చివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారుల అలసత్వం వల్ల మా పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. బొమ్మకూరు రిజర్వాయర్‌లో నీళ్లు ఉండి కూడా విడుదల చేయకపోవడంతో పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేస్తే అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నీటిని విడుదల చేయకపోతే రెండు రోజుల్లో భారీ ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు. రైతుల ధర్నాతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.