లింగాల గణపురం : ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే కాలంలో సమృద్ధిగా సాగుకు నీరు అందిందన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంఈతో రైతులు వ్యవసాయాన్ని పండగలా చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు మారిపోయాయన్నారు. చెరువులు, వ్యవసాయ బావులు, బోరు బావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. భూగర్భ జలాల తరిగి పోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది రైతులు ప్రతిమడికి పైపులు అమర్చి నీళ్లు అందిస్తున్నా మొదటి మడి మినహా తదుపరి మళ్లు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఎండిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ రవీందర్‌కు అందించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోసంగి శంకరయ్య, దేవదానం, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.