యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల రుణమాఫీ కష్టాలు తీరడంలేదు. ఎన్నికల కోసం కేవలం ము న్సిపాలిటీల్లోని నేత కార్మికులకు నిధులు విడుదల చేసినా మాఫీ మాత్రం కావడంలేదు. కొందరికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మరికొందరికి పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది. బ్యాంకుల కొర్రీల కారణంగా ఇబ్బందులు తప్పడంలేదని నేతన్నలు వాపోతున్నారు. ముఖ్యంగా ఎస్బీఐలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అంతే కాకుండా కస్టమర్లకు మెసేజ్‌లు, ఫోన్లు చేసి కచ్చితంగా నెలనెలా కిస్తీలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 10వేల మంది నేతన్నలు, అనుబంధ కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు మగ్గాల ఏర్పాటుకు, ఉత్పత్తికి ముడి సరుకు కొనుగోలు కోసం రుణాలు తీసుకున్నారు. అయితే చేనేత రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని తెలగు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లా నుంచి చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా రాష్ర్టానికి పంపించారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. గతేడాది మార్చిలోనే నిధులు మంజూరైనా మాఫీ మాత్రం చేయలేదు. ఇక మున్సిపల్ ఎన్నికల ముందు కేవలం మున్సిపాలిటీలోని కార్మికులకే నిధులు విడుదల చేసింది. వాస్తవానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో 2380 కార్మికులకు 19.25 కోట్ల రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, కేవలం ఆరు మున్సిపాలిటీల్లోని 1160 మంది కార్మికులకు మాత్రమే రూ. రూ. 9.60 కోట్లు విడుదల చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. రుణమాఫీకి బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. కెనరా, గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో 90 శాతం వరకు రుణమాఫీ పూర్తయ్యింది. ఇక ప్రధానంగా ఎస్బీఐ మాత్రం చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. భూదాన్‌పోచంపల్లిలో ఇప్పటి వరకు ఒక్క కార్మికుడికి మాఫీ కాలేదు. ఎంత రుణం తీసుకున్నా లక్ష మా త్రమే మాఫీ అవుతుంది. రూ.లక్షకు మించి రుణమున్నా రూ. లక్ష వరకు క్లియర్ చేస్తారు. కానీ ఎస్బీఐ ఎంత ఉన్నా మాఫీ చేయడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. మిగతా బ్యాంకుల్లో అసలు, వడ్డీ మాఫీ చేశారని, ఎస్బీఐ చేయడం లేని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. నెలానెలా కిస్తీలు కట్టాల్సిందేనంటూ నేతన్నలకు మెసేజ్‌లు, ఫోన్లు చేసి ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక కార్మికులు లబోదిబోమంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో మాత్రమే అరకొర రుణమాఫీ చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఎప్పుడు మాఫీ చేస్తారనే విషయమై స్పష్టత లేదు. ఇంకా 1220 మంది కార్మికులకు రూ. 9.62 కోట్ల మాఫీ కావల్సి ఉంది. దీంతో ఎప్పుడు మాఫీ అవుతుందోనని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మాఫీ కాకపోవడంతో మళ్లీ రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కొందరికే మాఫీ చేయడంపై కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వెంటనే రూరల్‌లో ఉన్న నేత కార్మికులకు కూడా చేనేత రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్బీఐలో రూ. 94 వేల అప్పు ఉంది. డబ్బులు కట్టాలని బ్యాంకు నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ఎస్బీఐలో సంప్రదిస్తే.. డబ్బులు చెల్లించాలంటున్నరు. వడ్డీ రాలేదట. మేం కట్టుకుంటా వెళ్తే తర్వాత మాఫీ అయితదని అంటున్రు. వడ్డీ వద్దని కార్మికులంతా సంతకాలు చేసి కాగితం రాసిస్తే అసలు మాఫీ చేస్తామంటున్రు. వడ్డీ వచ్చేదాకా లోన్ డబ్బులు కట్టాల్సిందే అంటున్రు. మిగతా బ్యాంకుల్లో మాఫీ అయ్యిందని సమాధానం చేప్తే.. అవన్నీ మాకు చెప్పొద్దంటున్రు.
పోచంపల్లి ఎస్బీఐలో కార్మికులకు రుణమాఫీ కాలేదు. వడ్డీ పైసలు వచ్చాక చేస్తామని, మమ్మల్ని ఎవరూ అడగొద్దంటున్నరు. ఎస్ఐబీలో ప్రాసెస్ కాలేదు. కెనరా బ్యాంకు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో 90 శాతం కార్మికులకు మాఫీ అయ్యింది. సాంకేతిక లోపంతో పేర్లు రాకపోవడంతో కొందరికి ఆలస్యమైంది. ఎన్నికల ముందు అందరికీ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ రుణమాఫీ చేయాలి. లేకపోతే మళ్లీ ఆందోళన చేపడతాం.