యాదగిరివాసా.. నమో నారసింహా!.. వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
యాదర్షి తపస్సును మెచ్చి వచ్చిన నరహరి శాంతమూర్తి. నవ్వు మోముతో జవ్వనికి తొడపై చోటిచ్చిన ప్రేమమూర్తి లక్ష్మీనరసింహుడు. నిండురూపుతో భక్తులను మెండుగా కరుణించే వేల్పునకు ఏడాదంతా వేడుకలే. ప్రతిదీ అద్భుతమే. ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలు స్వామి వైభవాన్ని రెట్టించి చూపుతాయి.
యాదర్షి తపస్సును మెచ్చి వచ్చిన నరహరి శాంతమూర్తి. నవ్వు మోముతో జవ్వనికి తొడపై చోటిచ్చిన ప్రేమమూర్తి లక్ష్మీనరసింహుడు. నిండురూపుతో భక్తులను మెండుగా కరుణించే వేల్పునకు ఏడాదంతా వేడుకలే. ప్రతిదీ అద్భుతమే. ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలు స్వామి వైభవాన్ని రెట్టించి చూపుతాయి. ఆలయ మాడవీధుల్లో యాదాద్రి నాయకుడి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతాయి.
యాదగిరిగుట్టలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు (ఈ నెల 18 నుంచి 28) సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్యపూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామివారి సన్నిధి మార్మోగుతుంది. పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బురపరుస్తాయి.

ముక్కోటి దేవతలు ఇక్కడుంటారు..
స్వస్తి వచనంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. ధ్వజారోహణంతో సమస్త దేవతలకూ ఆహ్వానం పలుకుతారు అర్చకులు. ఆ పిలుపు అందుకొని అష్ట దిక్పాలకులు ఇష్టంగా వస్తారు. ఇంద్రాది దేవతలు పరుగు పరుగున విచ్చేస్తారు. ఆగమేఘాల మీద వచ్చిన 33 కోట్ల దేవతలకు 33 రాగాల్లో, 33 తాళాల్లో, 33 వేదమంత్రాలు పఠిస్తూ సశాస్త్రీయంగా స్వాగతం పలుకుతారు. ఒక్కో దేవతకు మూడురకాల ఉపచారాలు చేసి బ్రహ్మోత్సవంలో పాలుపంచుకోవాలని కోరుతారు. ఇలా వచ్చిన దేవతలంతా అలా బాసింపట్టు వేసుకొని కూర్చుంటారు.
బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు స్వామివారి సన్నిధిలోనే కొలువుదీరుతారు. బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో ఉత్సవాలన్నీ కన్నులపండువగా కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. 11 రోజులు జరిగే ఈ ఉత్సవాలు అష్టోత్తర శతఘటాభిషేకంతో పూర్తి అవుతాయి.
యాదర్షి పుణ్యం
భక్త సులభుడు, శరణాగతవత్సలుడు, కోటిసూర్యతేజుడు అయిన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల వేళ గుట్ట పరవశిస్తుంది. నవ్యశిల్పకళా యశస్సుతో, భవ్య ఆధ్యాత్మిక ఉషస్సుతో తేజరిల్లుతున్న యాదగిరీశుడి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధి. పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న యాదగిరిగుట్ట క్షేత్ర వైభవం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! త్రేతాయుగంలో రుష్యశృంగ మహర్షి తనయుడు యాదర్షి ఇక్కడే నరసింహ స్వామి సాక్షాత్కారం కోసం పరితపించాడు.
ఆంజనేయుడు ఉపదేశించిన సుదర్శన నరసింహ మహామంత్రాన్ని కఠోర సాధన చేశాడట. యాదర్షి తపస్సుకు మెచ్చిన స్వామి జ్వాలా నరసింహుడిగా జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. మహోజ్వల జ్వాలగా జ్వాలా నరసింహరూపాన్ని చూసినా తనివి తీరని యాదర్షి మళ్లీ తపస్సు చేసి తనకు మరికొన్ని రూపాల్లో దర్శనమివ్వమని స్వామిని కోరారు. అప్పుడు స్వామి జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చి భక్తుడి ఇచ్ఛను పూర్తిచేశారు.
కొండంత దైవం
పూర్వం యాదగిరిగుట్ట దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కొన్ని గిరిజన తెగలు స్వామిని కొలిచేవి. కొన్ని తరాలకు గిరిజనులకు స్వామి జాడ దొరకక అడవంతా గాలించారు. చివరికి ఓ గిరిజన మహిళ స్వప్నంలో.. గుట్ట గుహలో గంభీరంగా ఉన్న తన ఐదు రూపాలతో స్వామి దర్శనమిచ్చాడని కథ ప్రచారంలో ఉంది. ఇక కలి యుగంలో ఓ గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే ఐదు రూపాల్లో ఉన్నానని స్థల గుర్తులు చెప్పారట. అలా యాదగిరీశుడు తన భక్తులను మరోసారి అనుగ్రహించాడు. నాటినుంచి పాంచరాత్ర ఆగమంలో స్వామికి పూజాదికాలు జరుగుతున్నాయి. గర్భగుడిలో జ్వాలా నరసింహస్వామి జ్యోతి రూపంగా ప్రకటితమవుతుంటాడు. మరికాస్త లోపల యోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహస్వామి మూర్తులు దర్శనమిస్తాయి.
గర్భాలయం బయట మెట్లకు ఎడమ వైపున క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి గుడి ఉంటుంది. హనుమంతుడి విగ్రహానికి కింద ఉన్న పెద్ద రాతి చీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఇక ఈ క్షేత్రాన్ని విహంగ వీక్షణం గావిస్తే.. యాదగిరి సింహాకృతిలో దర్శనమిస్తుంది. ఇదే ఉగ్రనారసింహం. బ్రాహ్మీ ముహూర్తకాలంలో తదేక ధ్యానంతో స్వామిని సేవించే భక్తులకు చిన్న చిన్న గర్జనలు వినిపిస్తాయట. యాద పర్వతం నుంచే ఆ శబ్దాలు వస్తాయని విశ్వసిస్తారు.

యాదగిరిలో ఉంటా..
నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, వరాహ పురాణాల్లోనూ యాదగిరి గుట్ట క్షేత్ర వైభవం గురించి కనిపిస్తుంది. అహోబిలంలో హిరణ్యకశిపుడిని వధించిన స్వామిని శ్రీశైల క్షేత్రంలో దేవతలంతా అర్చించారట. తర్వాత సిరిగిరి నుంచి ఉగ్రమూర్తిగా బయలుదేరిన స్వామిని దేవతలు అనేక విధాలుగా స్తుతిస్తూ ఆయన వెంట నడిచారట. అప్పుడు స్వామి తనతో పాటు వస్తున్న ప్రహ్లాదుడితో.. ‘యాదగిరి నాకు ప్రీతిపాత్రమైన క్షేత్రం. నేను అక్కడ నివసించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడని పురాణ కథనం. తర్వాతి కాలంలో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు స్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం గావించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
వైద్య నారాయణో నరసింహా
యాదగిరిగుట్ట నరసింహుడు వైద్య నారాయణుడిగా భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. దుష్ట గ్రహ బాధలు తీర్చే స్వామి.. మందులకు లొంగని రోగాలను కూడా కుదుర్చుతాడని విశ్వాసం. అందుకే అనారోగ్యంతో బాధపడే చాలామంది యాదగిరిగుట్టకు వచ్చి.. మండలం (40 రోజులు), అర్ధ మండలం (21 రోజులు), 11 రోజులు క్షేత్రంలో ఉండి.. నిత్యం స్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తుంటారు. అనుగ్రహం పొందిన భక్తులకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరిస్తాడనీ, కలలోనే చికిత్స చేస్తాడనీ, అటుపై వారికి రోగబాధలు ఉండవనీ చెబుతారు.
ఇలాంటి అనుభవం పొందిన భక్తులు కథలు కథలుగా చెప్పుకొంటారు. మరోవైపు స్వామి తన భక్తులను తానే ఎంపిక చేసుకొని, స్వప్నంలో వారికి మంత్రోపదేశం చేస్తారని సాధకులు చెబుతుంటారు. ఇన్ని విశేషాలతో భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని ధన్యత పొందుతారు.
– రంగనాథ్ మిద్దెల
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

