నర్మెట, మార్చి 17 : దేవాదుల నీటిని నమ్ముకునే వరి పంటలను సాగు చేశాం. పంటలు పొట్టదశలో ఉన్నా నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు రాకపోతే మాకు చావే శరణ్యమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం మండలంలోని బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లద్నూర్ రిజర్వాయర్‌కు బొమ్మకూర్ పంపుహౌస్ ద్వారా ప్రతి యేటా సాగు నీటిని విడుదల చేసేవారని దీంతో సాగు నీరు అందేదన్నారు.
భూగర్భ జలాలు కూడా ఉండేవని అన్నారు. ఈ సారి పంటలకు నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టదశకు వచ్చి పంట ఎండుతుంటే రైతుల గుండెలు తరుక్కుపోతున్నాయని ఆందోళన చెందారు. వెంటనే నీటిని విడుదల చేయాలని డీఈ శ్రీధర్, ఏఈ వెంకన్నను కోరారు. కార్యక్రమంలో లద్నూర్ మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, కాసర్ల కనకరాజు, పాకాల ఆదాం, నంద శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, కాసర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.