యాసంగి వడ్లు కొనేందుకు మోదీ సర్కారు మొండిచేయి చూపినా ‘మీకు నేనున్నానని.. ప్రతి గింజను కొంటా’నని సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. రైతుబంధు ఇచ్చి అదునులో ఆదుకోవడమే గాక కష్టకాలంలో భరోసా ఇచ్చిన రైతుబాంధవుడంటూ వాడవాడనా ‘వడ్ల సంబురాలు’ చేస్తున్నది. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు చాటుకున్నది. పంట కోతకు వచ్చిన సమయంలో ఊరూరా కాంటాలు పెట్టి మద్దతు ధరకు వడ్లు కొంటామని చెప్పి సంతోషం నింపాడంటూ జిల్లాకేంద్రాలు, పట్టణాలు, గ్రామాలు, పంట పొలాల వద్ద పండుగ చేసుకున్నది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్ ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం చేయడం, వరంగల్‌లో సీఎం ఫొటోతో వడ్లు తూకం వేయడం రైతుల్లో ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటాయి.
– వరంగల్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)
ధాన్యం కొనుగోలు చేస్తామనే సీఎం కేసీఆర్ ప్రకటనతో వాడవాడనా సంబురాలు మిన్నంటాయి. బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ పాలాభిషేకాలు చేశారు. వరంగల్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో సంబురాలు నిర్వహించారు. బీజేపీ కొర్రీలు పెడుతుంటే ఓ రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాము నష్టపోకుండా వడ్లు కొంటామని ప్రకటించినందుకు ఓ రైతు సీఎం ఫొటోతో వడ్లు తూకం వేసి హర్షం వ్యక్తంచేశాడు.
బుధవారం వరంగల్ జిల్లాకేంద్రంలోని వరంగల్ చౌరస్తాలో అర్బన్ కో ఆపరేటివ్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలకేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బుద్ధి, జ్ఞానం, సిగ్గు లేదని మండిపడ్డారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రాజయ్య ధాన్యంతో అభిషేకం చేశారు. దున్నపోతు, కేంద్ర ప్రభుత్వం రెండూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.