జనగామ రూరల్, మార్చి 27: సాగునీరు విడుదల చేయాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ నేత బైరగోని యాదగిరి గౌడ్ అన్నారు. కోనసీమ మాదిరిగా ఉన్న పంట పొలాలు నేడు ఎండిపోయి బీటలు వారి దర్శనమిస్తున్నాయని చెప్పారు. జనగామ (Jangaon) వ్యవసాయ మాజీ మార్కెట్ చైర్మన్ బల్దే సిద్ధిలింగం, మండల రైతు బంధు సమితి మాజీ కోఆర్డినేటర్ భూ రెడ్డి ప్రమోద్ రెడ్డితో కలిసి మండలంలోని సిద్దంకి గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పలువురు రైతులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి కాలువలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతుల వేసిన పంటలు ఎండిపోయాయన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యంతోనే పొలాలు ఎండిపోయాయని విమర్శించారు.
ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని రైతులకు సాగునీరు అందించాలని, పంటలకు జీవం పోయాలని చెప్పారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ గ్రామంలో చూసినా ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, తమకు అప్పులే మిగిలియాంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే రైతులతో కలిసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మడిపల్లి సుధాకర్ గౌడ్, నాయకులు, రైతులు పుప్పాల మల్లయ్య, బీదని సిద్ధులు, రాగుల నరసయ్య, జన్నే రాములు, లక్కాకుల శీను, మడిపల్లి మల్లయ్య, భాస్కర్, చీకట్ల శీను, ఒరే చంద్రమౌళి, హరీష్, నరహరి తదితరులు పాల్గొన్నారు