బచ్చన్నపేట మార్చి 21: చేతికొచ్చే పంటలు ఎండిపోతున్న తరుణంలోనైనా ప్రభుత్వం గోదావరి జలాలతో (Godavari water)చెరువులు నింపకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వీఎస్ఆర్ నగర్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ముసిని రాజు గౌడ్, కోనేటి స్వామి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తే, సాగునీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను ఈ ప్రాంతాలకు తరలించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసిన పట్టించుకునే వారు లేరన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చెరువులు, కుంటలు గోదావరి జలాలతో కళకళలాడయాన్ని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అని చెప్పి దొంగ మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పంటల కోసం తెచ్చిన పెట్టుబడుల కోసం లక్షల్లో అప్పులు తెచ్చి రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలను తరలించి రైతులను ఆదుకోవాలి డిమాండ్ చేశారు.