బచ్చన్నపేట, అక్టోబర్ 17: గత 50 ఏండ్లుగా ఉన్న దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా ముస్లింలకు కేటాయించడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేటలో (Bachannapet) స్థానికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో సిద్దిపేట, ఆలేరు, జనగామ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా బచ్చన్నపేట దుర్గమ్మ గుడి ఆదీనంలో మూడు ఎకరాల స్థలం ఉంది. జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అత్యుత్సాహంతో ఆ స్థలాన్ని ముస్లింలకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి దేవాలయం ఆధ్వర్యంలో ఉన్న భూమిని, వారికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కలెక్టర్ వ్యవ్యవహరించడం తగదన్నారు.
రెవెన్యూ అధికారుల అండదండలతో, కలెక్టర్ తమ మతానికి చెందినవారనే అభిమానంతో ఎకరం స్థలాన్ని వారి కేటాయించడం సమంజసం కాదని చెప్పారు. గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న భూమిని ఏ విధంగా ముస్లింలకు కేటాయించారో కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు కేటాయించిన భూమి వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ మేరకు బచ్చన్నపేటలో బందుకు పిలిపునిస్తున్నట్లు చెప్పారు. ఊరందరి సమక్షంలో ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. రాస్తారోకో అనంతరం కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు.