పండిన ప్రతి గింజనూ కొంటాం..
జిల్లాలో 159 కేంద్రాలు
రైతులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
ప్రతి మండలంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణ
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ధాన్యం కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష
హాజరైన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య
జనగామ చౌరస్తా, అక్టోబర్ 30 : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్‌లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులు, రైతు బంధు సమితి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కరోనా కష్టకాలంలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, కొనుగోలు కేంద్రాల సభ్యులు ఎంతో కష్టపడి పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలిపారు. గతంలో జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులుండేవని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దయతో జిల్లాకు దేవాదుల జలాలు వస్తున్నాయన్నారు. దీంతో రిజర్వాయర్లు, చెరువులు అలుగు పోస్తున్నాయని దయాకర్‌రావు చెప్పారు. జిల్లాలో తేమ శాతం పెరిగి, ప్రతి చెరువు, బావుల్లో నీరు పుష్కలంగా చేరిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరంటుతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోకుండా కొర్రీలు పెడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వమే రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. యాసంగిలో ఏ పంట వేస్తే, ఏ విత్తనాలు వేస్తే బాగుంటుందో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు, ప్రజాప్రతినిధులకు, రైతుబంధు సమితి సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో వరితో పాటు ఇతర పంటలు లేపాక్షి పల్లి పంట వేస్తే ఎకరాకు రూ. 2-3 లక్షలు, డ్రాగన్ ఫ్రూట్ పంటతో ఎకరానికి కనీసం రూ.5 లక్షల వరకు లాభాలు వస్తాయని మంత్రి తెలిపారు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపారు.
పామాయిల్‌తో రైతులకు లాభాలు..
జిల్లాలో తేమ శాతం పెరుగడంతో రాజమండ్రి, సత్తుపల్లి ప్రాంతాల్లో మాదిరిగా పామ్ ఆయిల్ పంటను సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ పంటకు చీడపీడలు, కోతుల బెడద ఉండదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎకరానికి రూ.36 వేలు సబ్సిడీ వస్తుందని, రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. త్వరలో జిల్లాలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీని ప్రారంభించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వరి కంటే ఎక్కువ లాభాలు వచ్చే పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు రవాణాపరంగా కొనుగోలు కేంద్రాల వారికి సహకరించాలని ఎర్రబెల్లి ఆదేశించారు. ఒక్కో మండలానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలన్నారు. నవంబర్ 6 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. ధాన్యం రాబడులు పెరిగితే కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు తాగునీటికి ఇబ్బందిగా ఉన్న ఈ ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా ఉందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ రైతును రాజు చేయడానికి, రైతు కష్టాలు తీర్చడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా వరి పంటకు సంబంధించిన ప్రభుత్వ మద్దతు ధర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పకడ్బందీగా కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. జిల్లాలో లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. దీనికోసం 93 ఐకేపీ, 65 పీఏసీఎస్, ఒకటి ఇతర కొనుగోలు కేంద్రంతో కలిపి మొత్తం 159 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కేంద్రం వద్ద బ్యానర్ ఏర్పాటు చేసి దానిపై ప్రభుత్వ మద్దతు ధర ప్రదర్శించాలని అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జనగామ డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్‌రావు, అబ్దుల్ హమీద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్దిలింగం, జనగామ ఆర్డీవో మధు మోహన్, డీఆర్డీవో రాంరెడ్డి, డీసీవో కిరణ్ కుమార్, డీఏవో టీ రాధిక, డీసీఎస్వో రోజారాణి, డీఎం సివిల్ సైప్లె సంధ్యారాణి, డీఎం మార్కెటింగ్ నాగేశ్వరశర్మ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ, జిల్లా అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఐకేపీ, పీఏసీఎస్ ప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.