29(నమస్తేతెలంగాణ): జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కరంట్ పనులు చేయడమే కాకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆదివారం కరంట్‌ను గంటల తరబడి కట్ చేయడంతో ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బ్యాంకు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే పని ఉండగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రహదారి వెంట లైన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇదేమిటని విద్యుత్ అధికారులను అడుగగా తాము విద్యుత్‌ను నిలిపివేయలేదని, ఎల్సీ ఇవ్వలేదని తెలిపారు. దీంతో ఆశ్చర్యానికి లోలైన ప్రజలు, వ్యాపారులు విద్యుత్ అధికారులకు తెలియకుండా సరఫరా ఎలా నిలిచిపోతుందని మండిపడ్డారు. విధులు సక్రమంగా నిర్వర్తించాల్సిన అధికారులు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణాన్ని ప్రజలు తెలుసుకోగా షాక్‌కు గురయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు వారు ఏర్పాటు చేసుకుంటున్న ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కలీం అనే వ్యక్తి విద్యుత్ అధికారుల ఆదేశాలు లేకుండానే ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్‌ను బంద్ చేసి పనులను కొనసాగించిన విషయం బయటపడింది. ప్రైవేటు సంస్థలకు చెందిన ట్రాన్స్ఫార్మర్ను వారి సొంత స్థలంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. ఈ పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి స్థంభాన్ని జాతీయ రహదారిపై నుంచి తొలగించడంతోపాటు విద్యుత్ నిలిపివేసే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని, లైన్మెన్ నుంచి ఏఈ, డీఈలు వరకు విధులను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ, డీఈలను వివరణ కోరేందుకు ‘నమస్తేతెలంగాణ’ ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదు.