నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు
అడవిలోకి ఎవరూ వెళ్లొద్దని సూచన
పులి కనిపిస్తే హాని తలపెట్టొద్దు : ఎఫ్ఆర్వో సృజన
పెద్దపులి రాకతో అడవికి రక్షణ
ములుగురూరల్, ఆగస్టు 29: ములుగు జిల్లా జగ్గన్నగూడెం- దేవునిగుట్ట వైపు ఉన్న అటవీ ప్రాంతంలోని ముసలిమడుగు వద్ద గ్రామస్తులు గుర్తించిన పాద ముద్ర లు పెద్ద పులివే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అటువైపు వెళ్లొద్దని, పులి కనిపిస్తే హాని తలపెట్టొద్దని ఎఫ్ఆర్వో సృజన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవగా ‘ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం ములుగు ఎఫ్ఆర్వో సృజ న ఆదేశాల మేరకు అటవీశాఖ బీట్ ఫీసర్, సెక్షన్ ఆఫీస ర్లు, సిబ్బంది ముసలి మడుగు ప్రాంతానికి అటవీ మార్గం ద్వారా చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పాద ముద్రలను పరిశీలించారు. అక్కడ ఉన్న పాదముద్రలు 14 సెంటీమీటర్లు ఉండడంతో అవి పెద్ద పులివే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. ములుగు రేంజ్ దాటిన అనంతరం 2, 3 కిలో మీటర్ల దూరంలో పులి పాద ముద్రలు తమ సిబ్బందికి కనిపించాయని అన్నారు. కొన్ని రోజులుగా పెద్ద పులి ములుగు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో తిరిగింది నిజమేనని తెలిపారు. ప్రస్తుతం తమ రేంజ్ దాటి అడుగులను కనుగొన్నట్లు తెలిపారు. అటవీలో పెద్ద పులి ఉన్నందున జగ్గన్నగూడెం, అంకన్నగూడెం, సర్వాపురం, రాయినిగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన పశువుల కాపర్లు, ప్రజలు ఎవరూ అటుగా వెళ్లొద్దని ఆమె సూచించారు. పులికి అటవి అనుకూలంగా ఉంటుందని, ఉదయం, సాయంత్రం వేళల్లో అడవిలో ఎక్కువగా సంచరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అడవి నుంచి పెద్దపులి గ్రామాల సమీపంలోకి వచ్చినట్లు ఎవరికైనా కనపిస్తే దానికి హాని తలపెట్టొద్దని, తమకు సమాచారం అందించాలని అన్నారు. పులి కనిపిస్తే దాని నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిసర గ్రామాల ప్రజలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పెద్ద పులి రాకతో అడవికి రక్షణ
వన్య ప్రాణులకు నాడు ఆవాసంగా మారిన ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంచారం కాలక్రమేనా తగ్గిపోయింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అడవుల విస్తీర్ణం పెరిగి పూర్వ వైభవానికి వచ్చాయి. అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ వారి కళ్లు కప్పి స్మగర్లు అటవీ సంపదను అనేక మార్గాల ద్వారా దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అడవికి రారాజు అయిన పెద్ద పులి ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుండడంతో అటవీ సంపదకు ఎంతో రక్షణగా మారింది. మొత్తానికి పెద్ద పులి రాకతో అడవికి రక్షణ కవచంగా మారింది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఇటు పులిని, అటు ప్రజలను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.