మంగపేట ఆగస్టు26: వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపురంలో వెలసిన నాగులమ్మ గుడిలో ఆదివారం సామ కొత్తల(పొట్ట) పండుగను ఆదివాసీలు ఘనంగా జరుపుకొన్నారు. ఏటా పుబ్బ కార్తెలో ఈపండుగను నిర్వహించుకోవడం ఆదివాసీల ఆనవాయితీ. వేడుకల్లో భాగంగా ఉదయాన్నే నాగులమ్మ పూజారులు, వడ్డెలు, ఆదివాసీ పెద్దలు గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి గద్దెలు, అమ్మవారి కుండలు శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి కొర్రలు, సామలు, మొక్క జొన్నలతో తయారు చేసిన పాయసాన్ని నాగులమ్మకు సమర్పించారు. ఈసీజన్లో కాసిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, మొక్క జొన్న కంకులు, ఆకుకూరలను తీసుకొచ్చి సమర్పించారు. కొత్తల పండుగనాడు అమ్మవారికి మొదటి పంట సమర్పించనిదే ఏ కాయగూర, పండ్లను ముట్టబోమని, పొట్టదశలో ఉన్న పంటలను నాగులమ్మకు ముడుపుదశలో కట్టడం సంప్రదాయమని గిరిజనులు తెలిపారు. ఆతరువాత మాన్నెం(నాటు కోడి పుంజును) గద్దెలపై సమర్పించి, బిందెలతో నీళ్లార బోసి, సుభీక్షంగా పంటలు పండాలని కోరుతూ పూజలు చేశారు. ప్రధాన పూజారి, గుడి మేనేజింగ్ ట్రస్ట్ బాడిశ రామకృష్ణస్వామి పర్యవేక్షణలో నిర్వహించిన వేడుకల్లో పూజారులు బాడిశ నాగరమేశ్, కొమరం ధనలక్ష్మి, నవీన్, పాపారావు, వడ్డెలు మడకం లక్ష్మయ్య, నాగులమ్మ జాతర కమిటీ బృందం, ఆదివాసీలు పాల్గొన్నారు
.
పోచమ్మకు బోనాలు
ములుగురూరల్: ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ తల్లికి అధిక సంఖ్యలో భక్తులు బోనాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి నైవేద్యాన్ని వండుకొని కోళ్లు, మేకలతో డప్పు చప్పుళ్ల మధ్య గుడి వద్దకు తరలివచ్చి పూజలు నిర్వహించారు.
గ్రామ దేవతలకు పూజలు
వెంకటాపురం(నూగూరు): వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు వాడల నుంచి మహిళలు బోనాల తీసుకొని వచ్చి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.