అబద్ధపు ప్రచారాలు మానుకోండి
ధాన్యం కొనబోమని చెప్పింది కేంద్రం కాదా..?
బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపాటు
హనుమకొండ/ పాలకుర్తి రూరల్, అక్టోబర్ 28: ‘పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడద్దు.. అబద్దపు ప్రచారాలు మానుకోండి.. దమ్ముంటే తెలంగాణలో వేసే ప్రతి పంటను, ధాన్యాన్ని మొత్తం కొంటమని కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకురండి.. చేతకాకపోతే చవటలమని ఒప్పుకొని ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయండి.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంపీ బండి సంజయ్ అర్థం లేని దీక్ష చేస్తున్నడు’ అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీయే అడ్డుకుంటోందని స్పష్టం చేశారు. ఎవరిని మభ్యపెట్టేందుకు బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల బాధలు, కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ధాన్యం కొంటామనే చెప్తున్నారని, దమ్ముంటే బండి సంజయ్ ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దీక్షలు చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. రైతుల విషయంలో కేంద్రం దొంగ ప్రేమ చూపుతున్నదని, కపట నాటకమాడుతున్నదని ఎద్దేవా చేశారు. ‘రైతులను కార్లతో తొక్కించింది మీరు కాదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం మొదలుకు ముందే ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కోరినా స్పందించలేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో వార్ వన్‌సైడేనని చెప్పారు. మంచి పదవులు, అవకాశాలు ఇస్తే ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను బొందపెడుతానని అన్నపుడే ఈటల బండారం బయటపడిందన్నారు. బీజేపీ బజారు రాజకీయాలను గమనించి తిప్పికొట్టి గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించాలని హుజూరాబాద్ ప్రజలు, రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వానకాలంలో కేవలం 59లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనేందుకు కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం కోటీ 35లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని కోరిందని పేర్కొన్న్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
బండి అసత్య ప్రచారాలు : ఎమ్మెల్సీ పల్లా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డాడు. 2014 నుంచి వరిని పెంచింది, నీటి సౌకర్యం కల్పించి కోటి ఎకరాల మాగాణం కోసం కావాల్సిన నీరు అందిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలు పెంచిన తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు. ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు పండుతాయో అక్కడ ఆయా పంటలు వేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పంట మార్పిడి చేయాలని, పప్పుధాన్యాలు, నూనె గింజలు పండించేందుకు ప్రోత్సహించాలని సూచించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యాన్ని కొన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ‘బండి సంజయ్ నీకు నీతి నిజాయితీ, అవగాహన ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయాలి’ అని పల్లా డిమాండ్ చేశారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వమని మరోమారు స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి విసిరిన సవాల్‌కు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
విజయ గర్జనకు జాతరలా తరలిరావాలి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా వరంగల్‌లో చేపడుతున్న విజయగర్జన సభకు జాతరలా తరలి రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సభ విజయవంతం కోసం పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల కార్యకర్తలతో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి 50వేల మందిని తరలించాలన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల బంధువు అని, సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ప్రభుత్వ పథకాలే పార్టీకి ప్రాణమన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలేదన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతానని చెప్పారు.