ములుగు, అక్టోబర్28 (నమస్తేతెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రాష్ర్టాలకు సహకరించే పరిస్థితి లేనందున యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె సభా అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ప్రధాన శాఖలైన వ్యవసాయం, ఉద్యాన వనం, పట్టు పరిశ్రమ, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖ, తాగు, సాగు నీటి పారుదల శాఖ, భూగర్భ జనులు, పంచాయతీ రాజ్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రతలో గ్రామాలను ముందుంచేందుకు పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుందని, సరైన రీతిలో నిధులను సద్వినియోగం చేసుకొని పరిశుభ్రత విషయంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచిన అధికారులను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. రామప్ప పూర్తి స్థాయి నీటి మట్టం కారణంగా ఎగువ ప్రాంతంలో ముంపునకు గురవుతున్న పొలాల విస్తీర్ణాన్ని గుర్తించేందుకు ఎఫ్టీఎల్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు టీకాలు తీసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డిప్యూటీ సీఈవో రమాదేవి, జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి, తుమ్మల హరిబాబు, జడ్పీకోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, తాడ్వాయి ఎంపీపీ వాణిశ్రీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.