బచ్చన్నపేట, అక్టోబర్ 22 : అంగన్వాడీ టీచర్లకు ఉ ద్యోగోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. దీంతో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు మూడుసార్లు వేతనం పెంచిన సీఎం కేసీఆర్ ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రమోషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే దిశగా మహిళా, శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. యదాద్రిభువనగిరి జోన్ పరిధిలో 36 పోస్టులు ఖాళీ ఉండగా, జనగామ జిల్లాలోని మూడు ప్రా జెక్టులు కొడకండ్ల, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి పాసై, ఉద్యో గం పొంది పదేండ్ల సీనియార్టీ కలిగి ఉండడంతో పాటు 50 ఏళ్లలోపు ఉన్న వారికి అవకాశం కల్పించింది. ఇందు కు గాను ఈ నెలాఖరు వరకు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. రాత పరీక్ష ద్వారా సూపర్వైజర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ టీచర్లు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీపి కబురు అందించింది. దీంతో అర్హులైన అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లుగా అయ్యే అవకాశం లభించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న సూపర్వైజర్ల పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పాసై ఉండి, పదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని 50 ఏం డ్లలోపు ఉన్న ప్రధాన, మినీ అంగన్వాడీ టీచర్లు గ్రేడ్-2 సూపర్వైజర్ల పోస్టులకు అర్హులు. జిల్లాలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో జనగామ ప్రాజెక్టు పరిధిలో 4, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 3, కొడకండ్ల పరిధిలో 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిని రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగోన్నతులు లభించనున్నాయి. అర్హులైన వారు రాత పరీక్ష కోసం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సూపర్వైజర్ల పోస్టుకు గాను అంగన్వాడీ టీచర్లతో పాటు ఐసీడీఎస్‌లో కాంటాక్టుపై పని చేస్తున్న సూపర్వైజర్లు, ఇన్స్ట్రక్టర్లు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. రాత పరీక్ష తేదీని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ప్రకటించనున్నారు.