నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఆగస్టు22: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఆదివారం రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్యతో పాటు పార్టీ నాయకులకు రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. నాయకులకు రాఖీలు కట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆమె వారికి స్వీట్లు పంపిణీ చేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజలు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ముల ప్రేమానురాగాల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెల్లు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి, మిఠాయిలు తీనిపించుకొని ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. ములుగు మండలంలోని 32 గ్రామాల్లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఏటూరునాగారం మండలంలో రక్షా బంధన్‌ను ఘనంగా నిర్వహించారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఇతర గ్రామాల్లో ఉన్న మహిళలు పుట్టింటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం కూడా రాఖీల దుకాణాల్లో అమ్మకాలు కొనసాగాయి. మంగపేట మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
రాఖీలు కట్టిన తమ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములు నూతన వస్ర్తాలు, కానుకలు సమర్పించి ఆనవాయితీని చాటుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మహిళలు ఒక రోజు ముందు నుంచే పుట్టించికి చేరారు. గోవిందరావుపేట మండలంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నాయిగూడెం ఎంపీపీ జనగం సమ్మక్క తన సోదరుడు జాడి రాంబాబుకు రాఖీ కట్టారు. వెంకటాపూర్ మండల వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మండల ప్రజలకు ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, జడ్పీటీసీ గై రుద్రమదేవి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటాపురం(నూగూరు) మండలంలో రాఖీ పండుగను పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వచ్చారు. రాఖీ కట్టి మిఠాయిలు తినిపించుకున్నారు. తాడ్వాయి మండలంలో ఆడపడుచులు పుట్టింటికి రావడంతో సందడిగా కనిపించింది. మంగపేట మండల వ్యాప్తంగా ఆడపడుచులు తమ తోబుట్టువులైన అన్నలు, తముళ్లకు రాఖీలు కట్టి సాంప్రదాయాన్ని చాటుకున్నారు. కమలాపురంలో బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాఖీలు కట్టారు. వాజేడు మండలకేంద్రంతోపాటు మండలంలోని ప్రగళ్లపల్లి జగన్నాథపురం, ధర్మవరం, పేరూరు, గుమ్మడిదొడ్డి , కొప్పునూరు తదితర గ్రామాల్లో రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలో విద్యాశాఖ అధికారి తేజవత్ వెంకటేశ్వర్లుకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కొట్టెం సునీత రాఖీ కట్టి మిఠాయి తినిపించి సోదర ప్రేమను చాటుకున్నారు. టేకుమట్ల మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
చిట్యాల మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో రాఖీ పండుగను ప్రజలు జరుపుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాఖీ వేడులను నిర్వహించారు. షీటీమ్ కానిస్టేబుల్ కోమల ఎస్సైకి, పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టి శుభాకంక్షలు తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు పుట్టిళ్లకు వచ్చి వారి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించుకున్నారు. మహాముత్తారం మండల వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. రాఖీల దుకాణాలు, బట్టల షాపులు రర్దీగా కనిపించాయి. మహదేవపూర్, కాటారం, మల్హర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సోదరీమణులు వారి సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహదేవపూర్, కాటారం మండల కేంద్రాల్లో రాఖీ స్టాళ్లు మహిళలతో రద్దీగా కనిపించాయి. కాటారంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి తన సోదరుడికి రాఖీ కట్టారు. పలిమెల మండలంలోని ఆయా గ్రామాల్లో అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసాను ఇస్తూ అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టి చెల్లెలు శుభాకాంక్షలు తెలిపారు.