తెల్లబంగారానికి అనుకూలం
జిల్లాలో 2.92 లక్షల ఎకరాల్లో పంటల సాగు
అత్యధికంగా 1.47 లక్షల ఎకరాల్లో పత్తి
వర్షాలతో ఏపుగా పెరుగుతున్న చేన్లు
మక్కజొన్న, కంది దిగుబడులు పెరిగే అవకాశం
తెగుళ్ల నివారణకు అధికారుల సూచనలు
జనగామ రూరల్, ఆగస్టు 22 : ఈ ఏడాది వానకాలం సీజన్ పత్తి రైతులకు కలిసొచ్చింది. జిల్లాలో గత జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో పంట సాగుకు అనుకూలంగా మారింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలతోపాటు దేవాదుల రిజర్వాయర్లలోకి నీరు చేరింది. భూగర్భ జలాలు సైతం పెరగడంతో పంపుసెట్ల ఆధారంగా కొందరు రైతులు తెల్లబంగారం సాగు చేశారు. జిల్లా మొత్తంలో 2.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి విస్తీర్ణం 1.47 లక్షల ఎకరాలుంది. వరి, మక్కజొన్న, పెసర, కంది పంటలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పంటల దిగుబడులు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ వానకాలం సీజన్లో వర్షాలు అనుకూలంగా ఉండడంతో జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగింది. చెరువులు, దేవాదుల రిజర్వాయర్ల పరిధిలో రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పత్తి, కంది, పెసర, మక్కజొన్న పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. పత్తి ప్రస్తుతం పూత దశలో ఉండగా పెసర చేతికి వస్తున్నది. గత సంవత్సరం అతివృష్టి మూలంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఈసారైనా పంట దిగుబడులు బాగుంటాయని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జిల్లాలో సాగవుతున్న పంటలకు తెగుళ్లు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు సూచనలు చేస్తున్నారు. మెట్ట భూముల్లో పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పండిస్తున్నారు. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులు పత్తి సాగు చేస్తారు. రెండు, మూడు వర్షాలు పడిన తర్వాత కంది, సోయా ఇతర పంటలు వేస్తారు. జిల్లాలో ఈ వానకాలంలో 2.93 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. జూన్‌లో వర్షాలు బాగా కురవడంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు వేశారు. అనంతరం వర్షాలు మందగించడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జూలైలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మించిన స్టేషన్‌ఘన్‌పూర్, మల్లన్నగండి, బొమ్మకూరు, వెల్దండ, కన్నెబోయినగూడెం, అశ్వరావుపేట, చీటకోడూరు, నవాబుపేట రిజర్వాయర్లు నిండాయి. ఫలితంగా వరి పంటకు నీటి కొరతలేదు.
వాతావరణ పరిస్థితులు అనుకూలం
జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వరితోపాటు మెట్ట పంటలు ఏపుగా పెరుగుతున్నా యి. తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేస్తున్నారు. పత్తి పంటకు ఆశించే రసం పీల్చే పురుగు నివారణకు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామా ల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు ఏఏ పురుగు మందులు వాడాల్లో సూచిస్తున్నారు.
పంటలకు అనుకులంగా వర్షాలు
వాతావరణ పరిస్థితులు జిల్లాలో పంటలకు అనుకూలంగా ఉన్నాయి. వరి 1,52, 451 ఎకరాలు, పత్తి 1,47, 631 ఎకరాలు, కంది 19, 935 ఎకరాలు, పెసర 2,867 ఎకరాలు, మక్కజొన్న 5,608 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. దీంతో ఈసారి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. పంటలకు తెగుళ్లు సోకకుండా గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సూచనలు చేస్తు న్నాం. పత్తి పంటపై గులాబీ రంగు, రసం పీల్చేపురుగు, లద్దె పురుగు, కాండం తొలిచే పురుగు నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలిస్తున్నారు.
-టక్కోలు రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి, జనగామ