అందరి పండుగలను గౌరవిస్తున్న సీఎం కేసీఆర్
మన ఆచారాలు, అలవాట్లపై దాడులు బాధాకరం
ఒకరి విశ్వాసాలను.. ఒకరు ఖండించాల్సిన అవసరం లేదు
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
శివునిపల్లిలో మినీ క్రిస్మస్ వేడుకలకు హాజరు
స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 21 : ‘మన దేశంలో మన ఆచారాలు, అలవాట్లపై దాడులు జరుగుతున్నాయి.. ఇది చాలా బాధాకరం.. ఒక రి విశ్వాసాలను మరొకరు ఖండించాల్సిన అవసరం లేదు..’ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ పాస్టర్ల మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘మన దేశంలో చర్చిలపై, పాస్టర్లపై దాడులు జరుగుతున్నాయని.. ఇది విచారించాల్సిన విషయం’ అని ఆవేదన చెందారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, అన్ని మతాల పండుగలను గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. బతుకమ్మ, రంజాన్ పండుగలను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి, క్రిస్మస్ పండుగను కూడా గౌరవిస్తూ రూ.33కోట్లతో రెండున్నర లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో క్రిస్మస్ విందులు కూడా నిర్వహిస్తున్నారని, సీడీఎఫ్ నిధులతో చర్చిల పునరుద్ధరణ చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. పేదలకు కొత్త జీవితాన్ని అందించేలా పాస్టర్లు సేవ చేయాలని సూచించారు. నియోజకవర్గంలో నిత్యం దైవ సేవలో ఉండే 200మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి రూ.2వేల విలువైన డానియల్ రిఫరెన్స్ బైబిల్‌ను కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు.
మానవత్వమే సమానత్వం: బిషప్ ఉడుముల బాల
ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, మానవత్వమే సమానత్వమని ఉమ్మడి జిల్లా పీఠాధిపతి, బిషప్ ఉడుముల బాల అన్నారు. అర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన చేయాలని పాస్టర్లకు సూచించారు. విలువైన బైబిల్‌ను అందించినందుకు పాస్టర్ల తరఫున కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.