పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
అధికారుల నిర్లక్ష్యం సరికాదు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, డిసెంబర్ 21: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాలకమండలి, అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేయించారు. వాటికి సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అనుకున్న పురోగతి లేకపోవడంతో మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అరూరి సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పాలక మండలి సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌కు ఎమ్మెల్యే సూచనలు చేశారు. కాంట్రాక్టర్ పనులను వేగవంతంగా పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతోపాటు విమర్శలు వస్తున్నాయని ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులు వివరించారు. డివైడర్ పనుల్లో జాప్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వేసవిలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలో వార్డుల వారీగా జరుగుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను అరూరి ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులను ఎమ్మెల్యే మందలించారు. సమీక్షలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రముఖులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
వర్ధన్నపేట/పర్వతగిరి: కులమతాలకతీతంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట పట్టణంలోని చర్చిలో క్రిస్టియన్లకు ఆయన క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, జడ్పీటీసీ భిక్షపతి, తాసిల్దార్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా పాల్గొన్నారు. పర్వతగిరిలో క్రైస్తవులకు అరూరి క్రిస్మస్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఉసురు తీస్తున్న బీజేపీ మాటలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, పట్టపురం ఏకాంతం గౌడ్, సర్పంచ్ చింతపట్ల మాలతి సోమేశ్వర్రావు పాల్గొన్నారు. అనంతరం గోపనపల్లికి చెందిన బెల్లం రచన ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచ్ మహేశ్, ఉపసర్పంచ్ అశోక్ ఉన్నారు.
సమన్వయంతో పని చేయాలి
పర్వతగిరి: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనులు, ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులు సమాధానాలు చెప్పారు. కొంకపాక, ఏబీ తండా, సోమారం, గోరుగుట్టతండాలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ మోహన్‌రావు, సర్పంచ్‌లు ప్రమీల, గణేశ్, వెంకన్ననాయక్, అమ్మినాయక్ కోరగా, కృషి చేస్తానని ఏడీఈ చంద్రమౌళి తెలిపారు. ఎంపీవో మధుసూదన్ మాట్లాడుతూ సకాలంలో పన్నులు చెల్లించాలని ప్రజలను కోరారు. పీఆర్ ఏఈ కవిత మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సీసీరోడ్లు మంజూరైనట్లు తెలిపారు. జీపీలు, మహిళా సంఘాలకు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్ ఆఫీసర్ ప్రశాంతి మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్లో వేగం పెంచినట్లు తెలిపారు. ఉపాధి పనుల టార్గెట్ పూర్తి కాకపోవడంపై జడ్పీటీసీ సింగ్‌లాల్ అసహనం వ్యక్తం చేశారు. కూలీలతో పనులు చేయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవో సంతోష్‌కుమార్‌ను అరూరి కోరారు. ఏవో ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ మండలం లో పది మంది రైతు కుటుంబాలకు రైతుబీమా సొమ్ము అందించినట్లు తెలిపారు. కొంకపాక చెరువులోకి ఎస్సారెస్పీ నీటిని తరలించేందుకు శాశ్వత పనులు చేయాలని ఎమ్మెల్యేను ఎంపీటీసీ మోహన్‌రావు కోరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్, తాసిల్దార్ మహబూబ్ అలీ, మార్కెట్ డైరెక్టర్లు పట్టపురం ఏకాంతం గౌడ్, శాంతిరతన్‌రావు, సర్పంచ్‌లు చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడుగుల రాజు పాల్గొన్నారు.