విలువ రూ.80 లక్షలు
ముగ్గురు నిందితుల అరెస్ట్
పరారీలో ఇద్దరు నిందితులు
రెండు వాహనాలు సీజ్
గణపురం మండలం చెల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గణపురం మండలంలోని గాంధీనగర్ క్రాస్ రోడ్డు వద్ద రూ.80 లక్షల విలువైన 4.05 క్వింటా ళ్ల గంజాయి పట్టుకున్నట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏర్పా టు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెల్పూరు నుంచి హైదరాబాద్‌కు రెండు కార్లలో గంజా యి తరలిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు నిందితులు కార్లను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గొర్లవీడు గ్రామానికి చెందిన కొంరెడ్డి రవీందర్‌రెడ్డి, గోపు శ్రీధర్‌రెడ్డి, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన అంగోత్ రాజేందర్, వారి స్నేహితులైన గొర్లవీడుకు చెందిన బానోత్ బాబుకుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెంది న దరావత్ మల్సూర్ నుంచి భద్రాచలం పరిసరాల్లో తక్కువ ధరకు 4.05 క్వింటాళ్ల ఎండు గంజాయి కొనుగోలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి రెండు కార్లలో చెల్పూర్‌కు తరలించినట్లు తెలిపారు. చెల్పూర్ నుంచి రెండు కార్లలో గంజాయి హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు ఒక్కో కారుకు రూ. 50 వేలు కిరాయి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌కు తరలించే క్రమంలో గాంధీనగర్ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని చెకప్పారు. నిందితులు కొంరెడ్డి రవీందర్‌రెడ్డి, గోపు శ్రీధర్‌రెడ్డి, అంగోత్ రాజేందర్ అరెస్ట్ చేయగా బానోత్ బాబు, దరావత్ మల్సూర్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. రెండు వాహనాలను సైతం సీజ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు.
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. జిల్లా పరిధిలో ఎవరైనా గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అలాంటి వారి సమాచారం ఉంటే డయల్ 100 లేదా, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. గంజాయిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ పులి వెంకట్, గణఫురం, చిట్యాల, రేగొండ ఎస్సైలు ఉదయ్‌కిరణ్, కృష్ణప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ముందే హెచ్చరించిన ‘నమస్తే తెలంగాణ’
జిల్లాలో గంజాయి, గుట్కా విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయని, అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 14న ‘ఆగని దందా’ కథనం ప్రచురణ విదితమే.. ఏయే మండలాల్లో మత్తు పదార్థాల రవాణా, గంజాయి సాగు వంటి అంశాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే..
కాటారంలో ఇద్దరి అరెస్ట్
మహదేవపూర్ (కాటారం), డిసెంబర్ 21 : గంజాయితో వెళ్తున్న వ్యక్తులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. కాటారం ఎస్సై శ్రీనివా స్ కథనం ప్రకారం.. కాటారం మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గుండపు మహేందర్‌తో పాటు ఓ బాలుడు అడవి ముత్తారం మండలానికి చెందిన మాడెం తరుణ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందినట్లు ఎస్సై చెప్పారు. ఈ నేపథ్యంలో మండలకేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారివద్ద నుంచి 35 గ్రాముల ఎండు గంజాయి గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు.