భూపాలపల్లి రూరల్/కాటారం, ఆగస్టు 21:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హై తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని ఆరు సెంటర్లలో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 225 మంది విద్యార్థులకు గాను 152 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు ఏడో తరగతిలో 54 విద్యార్థులకు గాను 25 మంది, ఎనిమిదో తరగతిలో 40 మందికి గాను 21 మంది, తొమ్మిదో తరగతిలో 25 మందికి గాను 16 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికా అబ్దుల్ హై, అకడమిక్ మానిటరింగ్ అధికారి లావుడ్యా మనోహర్ నాయక్ పరిశీలించారు. కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలు ప్రశంతంగా ముగిశాయి. ఉదయం, సాయంత్రం కలిపి 64 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 31 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ బానోత్ మధు తెలిపారు.