ఉపాధ్యాయుల కేటాయింపుల్లో అవకతవకలు
సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతా పోస్టులు
విద్యాశాఖ అధికారులపై విమర్శలు
న్యాయం చేయాలని ఫిర్యాదులు
ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానం బుట్టదాఖలు
డీఈవో ఆఫీస్, హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిరసనలు
సుబేదారి, డిసెంబర్ 20: ఉపాధ్యాయుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, క్యాడర్ సర్దుబాటు జాబితా తయారీలో ముందు చూపులేకపోవడం, పలుకుబడి ఉన్నవారికి, సంఘాల లీడర్లకు, నకలీ మెడికల్ సర్టిఫికెట్లతో ఆప్షన్ పెట్టుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలకు దారితీసింది. హనుమకొండ డీఈవో కార్యాలయం జారీ చేసిన కేటాయింపుల జాబితాలో జీవో 317 నిబంధనలు ఉల్లంఘించారని, సీనియారిటీని పాటించలేదని, ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానాన్ని పాటించలేదని ఉమ్మడి జిల్లాకు చెందిన చాలామంది బాధిత ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు పెద్ద సంఖ్యలో హనుమకొండ డీఈవో ఆఫీస్‌కు తరలివచ్చారు. తమకు అన్యాయం చేశారని అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఈవో కే నారాయణరెడ్డి కలెక్టరేట్లో ఉన్నారని తెలుసుకొని అక్కడి వెళ్లి ఆయనను నిలదీశారు.
మచ్చుకు కొన్ని..
ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన మండల స్థాయి లీడర్, వరంగల్ జిల్లాలోని ఓ మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది. ఆమె సీనియారిటీ ప్రకారం జాబితాలో క్రమ సంఖ్య 450లోపు పేరు ఉంది. కానీ ఆదివారం డీఈవో కార్యాలయం ప్రకటించిన జాబితాలో 320 లోపు చేర్చారు. ప్రాధాన్యతగా ఇదే జిల్లాకు కేటాయించారు. సీనియారిటీలో ఆమెకంటే ముందు వరసలో ఉన్న వారికి అన్యాయం జరిగిందనిబాధిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
2003 డీఎస్సీకి చెందిన ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లు తక్కువ మార్కులతో ఎక్కువ ర్యాంకులో ఉండి, సీనియారిటీలో వెనుక వరుసలో ఉన్నారు. వీరు ప్రాధాన్యతా పోస్టింగ్‌ను పొందారు. వీరి కంటే ఇదే డీఎస్సీలో ఎక్కువ మార్కులు సాధించి, సీనియారిటీ లిస్టులో ముందున్న ముగ్గురిని పక్కన పెడుతూ, డీఎస్సీ మెరిట్ మార్కులు, ర్యాంకును పరిగణలోకి తీసుకోకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సదరు ముగ్గురు బాధితులు డీఈవో కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నారు.
1996 డీఎస్సీకి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలికి ప్రాధాన్యతా పోస్టింగ్ కాకుండా నాలుగో ఆప్షన్ జిల్లా మహబూబాబాద్‌కు కేటాయించారు. 1997 డీఎస్సీ ఎస్జీటీ ఉపాధ్యాయురాలికి మొదటి ప్రధాన్యత వరంగల్ జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు. 1998 డీఎస్సీ ఉపాధ్యాయురాలికి మొదటి ప్రాధాన్యత హనుమకొండ జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు.
ఎడ్ల సంధ్య స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) ఆప్షన్స్‌లో హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి ఇవ్వగా భూపాలపల్లికి కేటాయించారు. కానీ వరంగల్‌లో ఎస్సీ మహిళకు ఎస్సీ, ఎస్టీ రోస్టర్‌లో ఒక్కరికీ ఇవ్వలేదు. ‘ఎస్సీ మహిళగా సీనియారిటీలో 8వ నెంబర్లో ఉన్నా ను. దాని ప్రకారం నాకు వరంగల్ జిల్లా రావాల్సి ఉం ది. ఎస్సీ పురుషుల్లో 17 మందిని వరంగల్‌కు ఇచ్చా రు. ఒక్క ఎస్సీ మహిళను కూడా కేటాయించలేదు. ఎస్సీ మహిళకు అన్ని జిల్లాల్లో కేటాయించారు. వరంగల్‌లో మాత్రమే ఇవ్వలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ రోస్టర్‌లో ..
ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానంలోనూ అవకతవకలు జరిగాయి. సీనియారిటీ జాబితాలో 241 పేరు ఉన్న తనను కాదని, 344, 359 వారికి ప్రాధాన్యతగా వరంగల్ జిల్లాకు కేటాయించారని బాధితుడు బాను వాపోయాడు. రోస్టర్ విధానంలో ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు తప్పకుండా కేటాయింపుల్లో 15శాతం రోస్టర్ పాటించాలి. కానీ ఉమ్మడి జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు అవేవీ పాటించకుండానే కేటాయింపులు చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత ఉపాధ్యాయులు వినతి పత్రాలు అందజేశారు. పీఆర్టీయూ, యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోను కలిసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.