మహబూబాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా బీళ్లుగా ఉన్న వ్యవసాయ భూములను చూసి చలించిపోయి.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పచ్చని పంట పొలాలతో కళకళలాడాలని మిషన్ కాకతీయ చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1.24కోట్ల ఎకరాల్లో పంటలు పండేలా నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని అన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే ధ్యేయంగా కృషిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల వద్ద నుంచి రాష్ట్రం స్థోమతకు మించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, కేంద్రం ఏమాత్రం పట్టదన్నట్లు చూస్తుండడం చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతుల పాపం ఊరికే పోదని, ధాన్యం కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని విమర్శించారు. కేంద్రం మొండి వైఖరిని ఎండగట్టి తెలంగాణలో వడ్లు కొనేలా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగవ్వకుండా చేస్తారని హెచ్చరించారు. కేంద్రం దొంగచాటుగా తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 750 మంది రైతులు మృత్యువాత పడ్డారని గుర్తుచేశారు. పోడు సమస్యలకు శాశ్వత పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరిస్తోందని తెలిపారు. దేశంలో కరువు సంభవిస్తే ఆహార నిల్వలను పంచాల్సింది పోయి, వరి పండించొద్దని చెప్పడం కేంద్ర ప్రభుత్వ నీతిమాలిన చర్యకు అద్దం పడుతోందన్నారు. సీఎం పిలుపు మేరకు సోమవారం వ్యవసాయ మార్కెట్ సెంటర్లో చేపట్టే నిరసన కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ పాల్గొన్నారు