జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సర్కారుపై కదంతొక్కేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడంతో పాటు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు నిరసన బాటపట్టింది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో నేడు(సోమవారం) ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఊరూరా ధర్నాలు, దిష్టబొమ్మల దహనాలు, శవయాత్రలతో చావుడప్పు మోగించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కదిలిరానున్నారు. ఎక్కడికక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననుండగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అన్నదాతల కోసం టీఆర్ఎస్ పోరును ఉధృతం చేస్తోంది. వడ్ల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని, బియ్యం పూర్తి చేసుకోవాలని డిమాండ్లతో ప్రతి ఊరిలోనూ నిరసన కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అమలుచేస్తున్న విధానాలను అందరికీ వివరించాలని సూచించారు. ఈమేరకు అన్ని గ్రామాల్లోనూ నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకండా చావుడప్పు కొట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలు తెలిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి గ్రామంలో కార్యక్రమం జరిగేలా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులను సన్నద్ధం చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశాలు నిర్వహించారు.
బీజేపీ నిరసన పోరును మరింత తీవ్రతరం చేసే కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన గ్రామగ్రామాన చావుడప్పును విజయవంతం చేయాలని సూచించారు. రైతులు ఎక్కువ మంది భాగస్వాములు అయ్యేలా నిరసన కార్యక్రమాలు ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులు పడుతున్న కష్టాలను నిరసన కార్యక్రమాలో వివరించాలని నిర్ణయించారు. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ రంగం అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వివరించి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాల మధ్య తేడాలను రైతులకు తెలియజెప్పేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టనున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
విజయవంతం చేయాలి : జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
ములుగురూరల్, డిసెంబర్12 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ములుగు ని యోజకవర్గంలోని అని మండలాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తూ ధర్నా, రాస్తారోకోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, రైతు కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహిళా సంఘాలు, వివిధ కార్మిక అనుబంధ సంఘాలు, పార్టీ అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొలని కోరారు.