సింగరేణి భూపాలపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం కవీంద్ర
ప్రకృతి భవన్, గనుల ఆవరణలో మొక్కలు నాటిన కార్మికులు, అధికారులు
భూపాలపల్లి, ఆగస్టు 19 : పచ్చదనం పెంపునకు సింగరేణి ఎనలేని కృషి చేస్తున్నదని భూపాలపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం కవీంద్ర అన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గురువారం వృక్షారోపణ్ అభియాన్ 2021లో భాగంగా ప్రగతి భవన్ సమీపంలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన కవీంద్ర మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. పెరిగిన పారిశ్రామికీకరణ వల్ల పర్యావరణ సమతుల్యం లోపించడం వల్ల ఎన్నో ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పది రాష్ర్టాల్లోని 38 జిల్లాలో 300 ప్రదేశాల్లో వృక్షారోపణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. భూపాలపల్లి సింగరేణిగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు 806 హెక్టార్లలో మొక్కలు నాటి పెంచినట్లు తెలిపారు. ఇదేకాకుండా ఉపరితల గనుల డంప్ యార్డుల పైన, కంపెనీ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటినట్లు చెప్పారు. ఆరు సంవత్సరాల్లో భూపాలపల్లి ఏరియాలో తెలంగాణకు హరితహారంలో 45 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి ఏరియాలో 4 లక్షల మొక్కలు నాటాలని (ప్రజలకు పంపిణీతో కలుపుకుని) లక్ష్యం కాగా, ఇప్పటి వరకు లక్షా 11వేల మొక్కలు నాటినట్లు వివరించారు. భూపాలపల్లి ఏరియాలో కంపెనీ నిర్వహిస్తున్న నర్సరీ 5.01 లక్షల మొక్కల పెంపకం సామర్థ్యం ఉందని, ఇందులో 58 జాతుల మొక్కలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్ మాట్లాడుతూ ఉద్యోగుల మనోవికాసానికి ఏరియాలో సింగరేణి పార్కులు, గార్డెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భూపాలపల్లి ఎఫ్ఆర్వో నరేశ్ మాట్లాడుతూ పర్యావరణ సమతులం ఉండాలంటే మొక్కలు పెంచడం ఒక్క టే పరిష్కార మార్గమన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు రామలింగం, సత్యనారాయణ, వెంకటేశ్వర్రావు, రమేశ్‌బాబు, తుకారాం, కృష్ణప్రసాద్, వసంత్ విద్యార్థులు, రెస్క్యూ సిబ్బంది, స్కౌట్స్ లీడర్లు, సింగరేణీయులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం ప్రకృతి భవన్ సమీపంలో ఐదెకరాల్లో 15 వేల మొక్కలు, గనుల ఆవరణలో ఐదు వేల మొక్కలు నాటారు. గనుల అధికారులు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.