యునెస్కో గుర్తింపుతో రామప్పకు గొప్ప గౌరవం
కాకతీయుల శిల్పకళా నైపుణ్యం విశ్వవ్యాప్తం
తెలంగాణకు రామప్ప గర్వకారణం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ఆలయానికి సతీసమేతంగా విచ్చేసిన సీజేఐ
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
రెండు గంటల పాటు ఆలయంలో పరిశీలన
నేడు వరంగల్ కోర్టుల సముదాయానికి ప్రారంభోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
వెంకటాపూర్/సుబేదారి, డిసెంబర్18 : ‘800 ఏళ్ల నాటి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం సముచితం, సమున్నతం, సంతోషభరితం.. కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి దక్కిన మహోన్నత గౌరవమిది.. వారసత్వ హోదాతో ఈ అద్భుత నిర్మాణం విశ్వంలోనే విశిష్ట కట్టడంగా నిలిచింది. తెలంగాణకు రామప్ప ఆలయం గర్వకారణం’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం పాలంపేటలోని రుద్రేశ్వరుడిని సతీసమేతంగా దర్శించుకున్న ఆయన, రెండు గంటల పాటు ఇక్కడే ఉండి రామప్ప ఆలయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా నేడు వరంగల్ కోర్టుల సముదాయాన్ని సీజేఐ ప్రారంభించనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అపూర్వ శిల్ప సంపదకు నెలవుగా ఉండి ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు మరల్చుకున్న రామప్ప ఆలయం తెలంగాణకే కాదు.. దేశానికే ఎంతో గర్వకారణమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని శనివారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రామప్పకు చేరుకున్న ఆయనకు హైదరాబాద్, వరంగల్, ములుగు కోర్టుల న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం పండింతులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. రుద్రేశ్వర స్వామికి జస్టిస్ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు రామప్ప ఆలయ నిర్మాణంలో కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ గురించి జస్టిస్ దంపతులకు వివరించారు. ఆలయ గైడ్లు గోరంటాల విజయ్, వెంకటేశ్ ఆలయ శిల్ప కళా నైపుణ్యాన్ని, విశిష్టతను సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా సీజేఐ రమణ మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు ద్వారా రామప్ప విశ్వంలోనే విశిష్ట కట్టడంగా నిలిచిందని, కాకతీయుల కళా నైపుణ్యం విశ్వవ్యాప్తమైందన్నారు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం, దశాబ్దాలు గడిచినా ఆలయానికి వాడిన రాళ్లు నేటికీ రంగు వెలసిపోకుండా, చెక్కుచెదరకుండా కాంతులీనడం రామప్ప విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధాన పాత్ర వహించాయన్నారు.
మన దేశం నుంచి ఈ ఘనతను సాధించిన మహానిర్మాణం రామప్ప అని, ఆలయానికి వారసత్వ హోదా దక్కడం సముచితం, సమ్మున్నతం, సంతోషభరితమని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో అధికారులు, న్యాయమూర్తులు, విశిష్ట అతిథులతో కలిసి జస్టిస్ రమణ దంపతులు ఫొటో దిగారు. సీజేఐ పర్యటనలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయవాదులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, రాజశేఖర్‌రెడ్డి, పీ నవీన్‌రావు, వరంగల్ జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్‌కుమార్, న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మహేశ్‌నాథ్, ములుగు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రామచంద్రారావు, కేంద్ర పురావస్తు శాఖ సూపరిండెంట్ స్మితా ఎస్ కుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేంద్రనాథ్బోయే, టూరిజం ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు, జిల్లా టూరిజం అధికారి శివాజీ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, వెంకటాపూర్, ములుగు, తాడ్వాయి తహసీల్దార్లు మంజుల, సత్యనారాయణస్వామి, శ్రీనివాస్, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, సకినాల భవాని, ఎంపీపీ బుర్ర రజిత, సర్పంచ్ డోలి రజిత, ఏపీవో సూర్యకిరణ్, జిల్లా అధికారి మల్లేశ్, ఏఈ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. సీజేఐ పర్యటన సందర్భంగా ములుగు ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆధ్వర్యంలో డీఎస్పీ దేవేందర్‌రెడ్డి, సీఐ గుంటి శ్రీధర్ భారీ బందోబస్తు నిర్వహించారు.
నేడు వరంగల్ కోర్టుల భవనాన్ని ప్రారంభించనున్న సీజేఐ
వరంగల్ కోర్టుల సముదాయం కొత్త భవనాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబస్తుపై సీపీ డాక్టర్ తరుణ్‌జోషి శనివారం సాయంత్రం కమిషనరేట్‌లో సెంట్రల్ డీసీపీ పుష్పారెడ్డి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఆదనపు డీసీపీ సాయి చైతన్య, ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్, ఏసీపీలు, సీఐలతో సమావేశమయ్యారు. భద్రకాళి ఆలయాన్ని సీజేఐ సందర్శన, వరంగల్ కోర్టుల సముదాయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. డీసీపీలు, అడిషనల్ డీసీపీలకు భద్రత బాధ్యతలు అప్పగించారు. సుమారు 800 మంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
సీజేఐకి హనుమకొండలో ఘన స్వాగతం