జయశంకర్ భూపాలపల్లి (నమస్తేతెలంగాణ), ములుగు టౌన్, ఆగస్టు18;వివిధ కారణాలతో బడికి వెళ్లలేక, చదువు మానేసిన వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభు త్వం సార్వత్రిక విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. చదవడం, రాయడం తెలిసిన వారికి దూర విద్యలో పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం కల్పించింది. ఇందుకోసం 2021-22 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 10 చివరి తేదీ కాగా, అపరాధ రుసుము తో 23 వరకు గడువు విధించింది.
సమాజంలో పాఠశాలలకు వెళ్లని, విద్యను అభ్యసించలేని బాలబాలికలకు, బాల్యంలో చదువుకోలేని వారికి తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ చది వే అవకాశం కల్పిస్తోంది. నిత్య జీవితానికి ఉపయోగపడేలా కాలానుగుణమైన విద్యా విషయక వృత్తి విద్యా సంబంధమైన కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగం, పదోన్నతులు, ఉన్నత విద్యా భ్యాసానికి అవసరమైన వారికి సార్వ త్రిక విద్య ఆశాకిరణంగా మారింది.
బడి మానేసిన, చదువుకోని వారికి మంచి అవకాశం
బడి మానేసిన, చదువుకోని వారికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సార్వత్రిక విద్యా విధానం సోపానంలా నిలుస్తోంది. వేలాది మంది ఉన్నత విద్యార్హతలు, పదోన్నతులు పొందుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్మీ యట్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 17నుంచి సెప్టెంబర్ 10 వరకుచివరి తేదీ ఉండగా, రూ. 200 అపరాధ రుసుముతో 11 నుంచి 23 వరకు గడువు ఉందని వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్రావు తెలిపారు. ఓపెన్ టెన్త్‌లో చేరేందుకు 14 ఏళ్లు నిండి చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఇంటర్‌కు 15 సంవత్సరాలు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ..
www.telanganaopenschoo.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పారాన్ని పూర్తి చేసి, ఫొటో, సంతకం, ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నిర్ణీత ఫీజును మీసేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించి, రసీదుతో పాటు దరఖాస్తు ప్రింట్ తీసుకొని అధ్యయన కేంద్రంలో సమర్పించాలి. పదో తరగతికి జనరల్ కేటగిరీ పురుషులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100, ప్రవేశానికి రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ పురుషులు, అన్ని వర్గాల మహిళలు రూ.100తోపాటు రూ.600 చెల్లించాలి. ఇంటర్లో ఓసీ పురుషులకు 200, 1300, మిగతా కేటగిరీలు 200, 800 కట్టాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు..
తెలంగాణ ఓపెన్ స్కూల్లోప్రవేశాల దరఖాస్తులను అభ్యర్థులు ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు సొసైటీ వారు నిర్ణయించిన ఫీజులను మాత్రమే మీ సేవ/టీఎస్ ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. వరంగల్ జిల్లా పరిధిలో 207 అధ్యయన కేంద్రాలు నడుస్తున్నాయి.