భక్తులు భాగస్వామ్యం కావాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భక్తాంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 18 : భూపాలపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం భక్తాంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి రూ.22.86 లక్షల (ప్రభుత్వ సర్వశ్రేయోనిధి)తో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ నేతలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లిలో నాటి జనాభాకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించారని, భూపాలపల్లి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరుగడంతో పునర్ నిర్మాణం అనివార్యమైందన్నా రు. రూ.22.86 లక్షలతో పనులు ప్రారంభిస్తున్నామని, నిధులు సరిపోవని ఆలయ కమిటీ విన్నవించిందని, మరో రూ.40 లక్షల మంజూరుకు ప్రయత్నిస్తానని అన్నారు. భక్తులు సైతం ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, తోచిన ఆర్థిక సాయం అందించాలని కోరారు. అలాగే ఏరియాలోని 1000 క్వార్టర్లలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరుపాలని కోరారని, ఇందుకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి తాటి అశోక్, వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి శారద, నేతలు బుర్ర రమేశ్ గౌడ్, ఆకుల మల్లేశ్, బండారి రవి, నాగుల రాజిరెడ్డి, నాగవెల్లి రాజలింగమూర్తి, ఆలయ ఈవో శేషగిరి, ఆలయ కమిటీ డైరెక్టర్లు శ్యాం కుమార్, భరత్‌కుమార్, గురిజాల శ్రీనివాస్, రమేశ్, గుగులోత్ రాజు, వెంకటలక్ష్మి, పూజారులు రాధాకృష్ణమాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.