నేటి నుంచి బుగులోని జాతర
మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి
రెండో తిరుపతిగా ప్రసిద్ధి
ప్రత్యేక ఆకర్షణగా ప్రభబండ్లు
తరలిరానున్న వేలాది మంది భక్తులు
రేగొండ, నవంబర్ 17 : పిలిస్తే పలుకుతూ, కోరిన కోర్కెలు తీర్చే ‘బుగులోని వెంకన్న’ జాతరకు వేళయ్యింది. ఎత్తైన గుట్టలు.. ప్రకృతి అందాలు.. కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరి భక్తుల కొంగుబంగారమయ్యాడు. నేటి ఉంచి మూడు రోజలు పాటు వైభవంగా జరిగే జాతరకు రేగొండ మండలం పాండవులగుట్ట ముస్తాబైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులతో సందడిగా మారనున్నది. మేక, ఏనుగు, గుర్రపు ప్రభబండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
కార్తీక మాసం మొదలైందంటే చాలు గుర్తుకొచ్చేది బుగులోని. ప్రకృతి అందాల మేళవింపు ఈ జాతర. ఎత్తయిన గుట్టలు.. పచ్చదనం.. ప్రకృతి చెక్కినట్లు కనిపించే కొండ చరియలు భక్తులను కట్టిపడేస్తుంటాయి. ఈ జాతర వస్తుందంటే చాలు ఊళ్లకు ఊళ్లు పయనమవుతుంటాయి. కుటుంబసమేతంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. గురువారం ప్రారంభమై మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సాగనుంది. రేగొండ మండలకేంద్రానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోని తిరుమలగిరి శివారు బుగులోని గుట్టలపై ఏటా కార్తీక పౌర్ణమి నుంచి బుగులు వేంకటేశ్వరస్వామి జాతర జరుగుతుంది. ఇక్కడ కొలువుదీరిన వెంకన్న భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మూడు రోజల పాటు అత్యంత వైభవంగా సాగే జాతరలో ప్రభ బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. చుట్టుపక్కల గ్రామాల నుంచి మేక, ఏనుగు, గుర్రపు ప్రభలను గుట్ట కింద ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ తిప్పుతారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
జాతర ప్రాశస్త్యం..
వేంకటేశ్వరస్వామి, అలివేలుమంగ, పద్మావతితో కలిసి ఆకాశ మార్గాన విహరిస్తుండగా పద్మావతి భూలోకంలో విశ్రాంతి కోసం తిరుమల తిరుపతి కొండలపై సేద తీరారు. దీంతో ఆది మొదటి తిరుపతిగా పేరుగాంచింది. అక్కడినుంచి స్వామి వారు సతీసమేతంగా బయల్దేరగా రెండోసారి జయశంకర్(భూపాలపల్లి) జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టలపై సేద తీర్చుకున్నారు. అందుకే స్వామివారు నడయాడిన ఈ ప్రాంతాన్ని రెండో తిరుపతిగా పిలుస్తారని ఈ ప్రాంత ప్రజల చెబుతుంటారు. ఒకసారి వెంకన్న స్వామి అలివేలు మంగ, పద్మావతితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మహిళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్న శబ్దానికి నిద్ర పట్టక బుగులు(భయంతో) ఆ పక్కనే ఉన్న గుట్టలపైకి ఆమ్మవార్లతో కలిసి స్వామి వెళ్లాడట. దీంతో నాటి నుంచి బుగులోని వేంకటేశ్వరస్వామిగా పిలుచుకుంటున్నారు. ఆ స్వామి వారు గుట్టపై ఉన్నట్లు తెలుసుకోవడానికి గొల్లవారు ఉన్న గ్రామాల్లో చల్ల ఆమ్ముతుండగా చల్ల ముంతలు, గొర్రెలు, పశువులను ఉన్న చోటనే మాయం చేయడంతో ఏమి చేయాలో తోచని ప్రజలు ఆ గుట్టలో వెలిసిన స్వామిని కొలవగానే మళ్లీ యథాస్థానంలో ప్రత్యక్షమైనట్లుగా ప్రజలు చెబుతుంటారు. ఆప్పటి నుంచి ఏటా కార్తీక మాసం పౌర్ణమి రోజున జాతర వైభవంగా జరుపుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న వారు స్వామి దర్శనానికి వెళ్తే తేనెటీగలు వెంటబడుతాయని భక్తులు చెబుతుంటారు.
నిష్టతో జాతర ఉత్సవాలు
బుగులోని జాతర ఉత్సవాలను తిరుమలగిరి గ్రామస్తులు ఎంతో నిష్టతో చేస్తారు. 18న(గురువారం) స్వామి వారు గుట్టపైకి వెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19న(శుక్రవారం) కార్తీక పౌర్ణమిన స్వామి వారికి దీపోత్సవం, ఏనుగు, మేక, గుర్రపు ప్రభ బండ్లు ఇప్ప చెట్టు చుట్టూ తిప్పడం, 20న (శనివారం) స్వామి వారికి అభిషేకం, వాహనాలు తిరుగడం, మొక్కలు చెల్లించడం, 21న (ఆదివారం) మొక్కులు చెల్లించడంతో జాతర ముగుస్తుంది.
ఇలా వెళ్లాలి..
హనుమకొండ-భూపాలపల్లి మార్గంలో రేగొండ వస్తుంది. జాతరకు వెళ్లే భక్తులు హనుమకొండ నుంచి భూపాలపల్లి, కాళేశ్వరం బస్సుల్లో రేగొండకు చేరుకోవాలి. లేకపోతే హనుమకొండ నుంచి పరకాలకు వెళ్లి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లొచ్చు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతారు. నేరుగా రేగొండ మండల కేంద్రానికి చేరుకున్న వారికి ప్రైవేటు వాహనాలు ఆందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి 48 కిలోమీటర్లు, పరకాల నుంచి 18 కిలోమీటర్లు, భూపాలపల్లి నుంచి 33 కిలోమీటర్లు, రేగొండ నుంచి 8కిలోమీటర్లు ఉంటుంది.
గుట్టలో వెలిసిన శివలింగం
పిలిస్తే పలుకుతూ, కోరిన కోర్కెలు తీర్చే బుగులోని వెంకన్న, కందికొండ నర్సన్న జాతరలకు వేళయ్యింది. ఎత్తయిన గుట్టలు.. ప్రకృతి అందాలు.. కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరి భక్తుల కొంగు బంగారమయ్యారు. ఏటా కార్తీక మాసంలో వైభవంగా జరిగే ఈ జాతరలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. మూడు రోజుల పాటు మేక, ఏనుగు, గుర్రపు ప్రభబండ్లతో జరిగే జాతరకు రేగొండ మండలం పాండవులగుట్ట, అలాగే పౌర్ణమి రోజున శుక్రవారం జరిగే లక్ష్మీనర్సింహస్వామి కల్యాణానికి కురవి మండలం కందికొండ ముస్తాబయ్యాయి.
అన్ని ఏర్పాట్లు చేశాం..
జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ కడారి జనార్దన్, ఆలయ వంశీయ అర్చకుడు కూర్మాచలం వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం, విద్యుత్, రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. పరకాల, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు. గుట్టపై విద్యుత్, మంచినీటి సౌకర్యంతోపాటు భక్తులకు స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ తెలిపారు.