విద్యార్థులతో ఏఎస్పీ గౌస్ ఆలం
వివిధ మండలాల్లో చైల్డ్ లైన్ సే దోస్తి కార్యక్రమాలు
ఏటూరునాగారం, నవంబర్ 17: క్రమశిక్షణతో చవితే విద్యార్థులు భవిష్యత్‌లో మంచి అద్భుతాలు సృష్టించగలుతారని ఏఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మండల కేంద్రంలో బుధవారం చైల్డ్సే దోస్తి కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ, ఎంపీడీవో, సీడీపీవో కార్యాలయాలను ఐసీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు విజిట్ చేశారు. ఆయా ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన క్రమంలో విద్యార్థులతో ఏఎస్పీ గౌస్ ఆలం మాట్లాడారు. ప్రభుత్వం అందించే సేవలను ఇప్పుడే తెలుసుకుంటే ఆయా సేవలను క్రమబద్ధంగా వినియోగించుకునే విధంగా విద్యార్థులు ఎదుగుతారని పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సీఈవో ప్రసూనరాణి విద్యార్థులతో మాట్లాడారు. గొప్ప విజ్ఞానాన్ని ఈ విజిట్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో అనురాధ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన పెంచుకోవాలి
మంగపేట: వివిధ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని ఎంఈవో రాజేశ్‌కుమార్ అన్నారు. చైల్డ్ లైన్ సే దోస్తీ, బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 13 నుంచి 20 వరకు విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులతో బుధవారం మండల పరిషత్, విద్యావనరుల కేంద్రం, తహసీల్, ఐసీడీఎస్, బ్యాంకు, పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాల సందర్శన జరిపి, వీటి ద్వారా ప్రజలు పొందే సేవలపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసి, మిగతా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని ఎంఈవో పేర్కొన్నారు.
బాలల హక్కులపై అవగాహన
గోవిందరావుపేట: బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రచార రథాన్ని ఎంఈవో గొంది దివాకర్ బుధవారం ప్రారంభించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో, ఐసీడీఎస్, పోలీస్‌స్టేషన్, బ్యాంకు, పోస్టు ఆఫీస్ కార్యాలయాల వద్ద విద్యార్థులతో మాట్లాడారు. డీసీపీయూ లీగల్ ఆఫీసర్ సురేశ్‌బాబు, చైల్డ్‌లైన్ సిబ్బంది నాగమణి, సత్యనారాయణ, శ్రీనివాసులు, నర్సయ్య, సుజాత, ఎంఆర్సీ సిబ్బంది భూరెడ్డి విష్ణు, కంకల రమేశ్, భిక్షపతి, కర్లపెల్లి, ఆశ్రమ పాఠశాల, గోవిందరావుపేట బాలికల పాఠశాల, చల్వాయి జడ్పీహెచ్ఎస్ , మోడల్ స్కూల్, కేజీబీవీల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
గోవిందరావుపేట: ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని పస్రా ఎస్సై చెన్నమనేని కరుణాకర్‌రావు అన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోలీస్ కేసులు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ చదువు నేర్పిన గురువులతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ అలవర్చుకోవాలి
వెంకటాపూర్: జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు ఎక్సోజర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్, ఆర్ఐ రాజకుమారి, ఏఎస్వో రమేశ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కృష్ణవేణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి
వెంకటాపురం(నూగూరు): విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని ఎస్సై తిరుపతి అన్నారు. విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీసులు ఎల్లవేలలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని అన్నారు. అనంతరం విద్యార్థులు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలను సందర్శించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ టీం సభ్యులు సుదర్శన్, తహసీల్దార్ అంటినాగరాజు, ఎంపీడీవో ఫనిచంద్ర, సీడీపీవో ముత్తమ్మ, సూపర్వైజర్లు పుష్పవతి, రమాదేవి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.