కురవి, నవంబర్ 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతవరకైనా పోరాడుతారని చెప్పారు. రాష్ట్రంలో యాసంగి వడ్లు కొంటారా? లేదా? అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేయాలని, ఆతర్వాతే రైతుల వద్దకు వెళ్లాలని హితవు పలికారు. కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతులను మోసం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ దిక్కుమాలిన కార్యక్రమాలను పెట్టి రైతులను అయోమయానికి గురిచేస్తున్నాడని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలను గూండాలుగా అభివర్ణిస్తే సహించేది లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే ‘బండి’ బయట తిరగలేడన్నారు. ఇప్పటికైనా మన రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీకి పోయి కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే టీఆర్ఎస్ పార్టీ ఎంత వరకైనా పోరాడుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, కురవి జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, గుగులోత్ శ్రీరాంనాయక్, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాంలాల్, ఐలి నరహరి, అల్లూరి కిశోర్‌వర్మ, బీబీనాయక్ తండా సర్పంచ్ బోడ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కిషన్‌నాయక్, రాందాస్ పాల్గొన్నారు.