డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య
స్టార్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ
ములుగురూరల్, ఆగస్టు 13 : లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వైద్యులు, సిబ్బందితో పాటు ప్రోత్సహించిన వారికి మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని స్టార్ దవాఖానను సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ మిషన్‌తో పాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు. స్కానింగ్ మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు మిషన్ పనితీరును పరిశీలించినట్లు వివరించారు. దవాఖాన సిబ్బంది పూర్తి సమాచారం ఉన్న పత్రా లు తనిఖీల సమయంలో చూపించని కారణంగా మూడు రోజుల గడువులో తమ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 104,1098 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనల ప్రకా రం పరీక్షలు జరపకపోతే వైద్య ఆరోగ్య శాఖ తరుపున కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అప్పయ్య హెచ్చరించారు. ఆయ న వెంట డెమో నవీన్ రాజ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.