ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి
మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి హంటర్‌రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ
హనుమకొండ చౌరస్తా/కాజీపేట, సెప్టెంబర్ 12 : హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను విజయవంతం చేయాని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. పోటీలను పురస్కరించుకుని వావ్ వరంగల్-హ్యాపీ హనుమకొండ ఆధ్వర్యంలో ఫాతిమా నగర్‌లోని మదర్‌థెరిసా విగ్రహం నుంచి హంటర్‌రోడ్డు వరకు ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వినయ్‌భాస్కర్, మేయర్ సుధారాణి, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ నెక్కొండ కవిత, డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. హనుమకొండకు చెందిన రంజిత్ తండ్రి గత సంవత్సరం కొవిడ్‌తో మరణించాడు. శారీరక శ్రమ, ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో రంజిత్ తన తండ్రి సంస్మరణార్థం 4,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి ఆదివారం హనుమకొండకు చేరుకున్న సందర్భంగా రంజిత్‌ను వారు సన్మానించి నేషనల్ అథ్లెటిక్స్ పోటీల గురించి ప్రచారం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో వావ్ వరంగల్-హ్యాపీ హనుమకొండ ప్రతినిధులు, సైక్లిస్టులు, యువకులు పాల్గొన్నారు.